జట్టు ఆటగాళ్లపై కోహ్లీ తీవ్ర అసంతృప్తి
బర్మింగ్ హామ్: చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో నెగ్గి చాంపియన్స్ ట్రోఫీలో బోణీ కొట్టినా టీమిండియాపై కెప్టెన్ విరాట్ కోహ్లీ అసంతృప్తిగా ఉన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన కోహ్లీ సేన గత ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాక్ పై 124 పరుగుల తేడాతో నెగ్గినా... సహచరులపై కోహ్లీ విమర్శలు గుప్పించాడు. ఫిల్డింగ్ విషయంలో టీమిండియాకు 10 పాయింట్లకుగానూ కేవలం 6 పాయింట్లే ఇచ్చాడు కోహ్లీ. యువరాజ్ సింగ్ ఆటవల్లనే ఇరుజట్లలో భారత్ మెరుగైన జట్టుగా నిలిచిందని కోహ్లీ ప్రశంసించాడు.
'పాక్ జట్టులో అత్యధిక స్కోరు చేసిన అజహర్ అలీ.. భారత్ ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఓసారి హార్దిక్ పాండ్య మంచి రనౌట్ చాన్స్ మిస్ చేయగా, మరోసారి భువీ అతడి క్యాచ్ ను వదిలేశాడు. షాదబ్ ఖాన్ ఆడిన బంతిని కేదార్ జాదవ్ క్యాచ్ పట్టకపోవడం లాంటి తప్పిదాలు మరెన్నో కనిపించాయని' కోహ్లీ వివరించాడు. బ్యాటింగ్ విషయంలో మాత్రం జట్టుకు 10కి గానూ 9 మార్కులు కచ్చితంగా ఇస్తానన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లలో అద్భుత ప్రదర్శన చేసిన జట్టు ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, ఫీల్డింగ్ తప్పిదాలతో మ్యాచ్ చేజారే అవకావం ఉంటుందని జట్టుకు కోహ్లీ విలువైన సూచనలిచ్చాడు.