క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌పై సరైన ప్రణాళికలు అమలు చేయకపోవడం వల్లే ఓడిపోయామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అంగీకరించాడు. సమిష్టిగా రాణించడంలో తమ జట్టు సభ్యులు విఫలమయ్యారని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. భారత్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్ట్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లి.. ఓ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. (అద్భుతాలు జరగలేదు.. మనం గెలవలేదు)
టెస్ట్ మ్యాచ్ రెండో రోజు మైదానంలో కోహ్లి ప్రవర్తించిన తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మైదానంలో అరుస్తున్న ప్రేక్షకుల వైపు తిరగుతూ.. నోరు మూసుకోవాలి అన్నట్లు కోహ్లి సైగ చేశాడు. అలాగే ఆవేశంగా ఏదో అంటున్నట్టు కనిపించాడు. ఇందుకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు నెటిజన్లు కోహ్లి క్రీడా స్పూర్తిని మరిచి ప్రవర్తించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్టు ఈ ఘటనపై కోహ్లి స్పందించాల్సిందిగా కోరారు. దీంతో అసహనానికి లోనైన కోహ్లి.. ఒక ఘటన గురించి పూర్తిగా తెలుసుకోకుండా ప్రశ్నలు ఎలా అడుగుతారని ఘాటుగా స్పందించాడు.
జర్నలిస్టు : విరాట్, మైదానంలో మీ ప్రవర్తనపై ఏం చెబుతారు?. కేన్ విలియమ్సన్ జౌట్ అయినప్పుడు మీరు ఎందుకు అలా ప్రవర్తించారు. టీమిండియా కెప్టెన్‌గా మైదానంలో ఇలాంటి సంప్రాదాయం నెలకొల్పడం సరైనది కాదని మీకు అనిపించలేదా?
కోహ్లి : మీరు ఏమనుకుంటున్నారు?
జర్నలిస్టు : నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను?
కోహ్లి : నేను మిమ్మల్ని సమాధానం అడుగుతున్నాను?
జర్నలిస్టు : మీరు మంచి సంప్రాదాయాన్ని నెలకొల్పాల్సి ఉంటుంది.
కోహ్లి : మీరు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే సరైనా ప్రశ్నలు అడగాలి. సగం వివరాలతో సగం సగం ప్రశ్నలు అడగకండి. ఒకవేళ మీరు వివాదం సృష్టించాలనుకుంటే ఇది అందుకు సరైన వేదిక కాదు. నేను మ్యాచ్ రిఫరీతో మాట్లాడాను.. అతనికి మైదానంలో జరిగిన దానితో ఎలాంటి సమస్య లేదు.
Comments
Please login to add a commentAdd a comment