
'మమ్మల్ని కోహ్లి కించపరిచాడు'
బెంగళూరు:క్రికెట్ గేమ్లో స్లెడ్జింగ్ అనేది భాగమే అయినప్పటికీ తమతో రెండో టెస్టు సందర్భంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు కించపరిచే విధంగా ఉందని ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హేలీ మండిపడ్డాడు. ఒక జట్టుకు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి.. ప్రత్యర్థి ఆటగాడ్ని 'టాయిలెట్' అంటూ స్లెడ్జింగ్ చేయడం అగౌరపరచడమేనని విమర్శించాడు. దాంతో పాటు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పట్ల కోహ్లి వ్యవహరించిన తీరు కూడా ఆహ్వానించదగ్గ పరిణామం కాదన్నాడు. ఈ తరహా మాటల యుద్ధానికి విరాట్ ఫుల్ స్టాప్ పెట్టి.. తన సహజసిద్ధమైన ఆటను ప్రదర్శిస్తే బాగుంటుందన్నాడు.
'ఆటలో విరాట్ కోహ్లి దూకుడు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడూ విరాట్ తరహా ఆటను చూడలేదు. గతంలో ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పా. అయితే ఇప్పుడు విరాట్ పై గౌరవం తగ్గిపోతుంది. రెన్ షాను 'టాయిలెట్' అంటూ స్లెడ్జ్ చేయడం ఎంతవరకు సమర్ధనీయం. ఇది మా ఆటగాళ్లను కించపరచడం కాదా. ఇలాగ మమ్మల్ని అగౌరపరచడం విరాట్ కు తగదు. గతంలో ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లను విరాట్ ఈ తరహాలో కించపరచలేదు. ఒత్తిడికి లోనవుతున్న విరాట్ గౌరవాన్ని కోల్పోతున్నట్లు కనబడుతుంది.భారత జట్టు కెప్టెన్ కాకముందు అతని దూకుడు భిన్నంగా ఉండేది. అదే సమయంలో చూడ ముచ్చటగా కూడా ఉండేది. ఇప్పుడు మాటలతో దూకుడుగా ఉన్నాడు. విరాట్ మాటల్ని తగ్గించి ఆటతో సమాధానం చెబితే బాగుంటుంది'అని హేలీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆసీస్ ఓపెనర్ రెన్ షాను 'టాయిలెట్' అంటూ విరాట్ స్లెడ్జింగ్ చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో రెన్ షా టాయిలెట్ బ్రేక్ తీసుకోవడాన్ని రెండో టెస్టు ఆదివారం నాటి ఆటలో విరాట్ ప్రస్తావించాడు. టాయిలెట్ అంటూ రెన్ షాను కవ్వించే యత్నం చేశాడు.