ఆధునిక భారత ముఖచిత్రం..‘కోహ్లీ’
చెన్నై: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆధునిక భారత్ ముఖ చిత్రమని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ, ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను పోల్చమని అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హెడెన్ కోహ్లీ, స్మిత్‌లను పోల్చడం కష్టమేనని, ఇద్దరూ సహజ సిద్దమైన ఆటగాళ్లేనని వ్యాఖ్యానించాడు. ఇరు జట్లకు బలమైన నాయకులన్న హెడెన్. కెప్టెన్సీలో మాత్రం తేడా ఉందన్నాడు.
ఆసీస్ క్రికెటర్ల సమస్య గురించి ప్రస్తావించగా త్వరలోనే సమస్య పరిష్కారమవుతందని భావిస్తున్నాని తెలిపాడు. టెస్టులు క్రికెట్‌కు చాల ముఖ్యమైనవని, ఐసీసీ ఎలా బ్యాలెన్స్ చేస్తుందో తెలియదు కానీ క్రికెట్ మనుగడకు అవి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డాడు. ఇక టెస్టులకు టీ20ల ముప్పు అన్న వాదనను హెడన్ కొట్టిపారేశాడు. ఏ ఫార్మాట్ అభిమానులు ఆ ఫార్మాట్‌ను ఆదరిస్తారని వారిని దృష్టిలో ఉంచుకోని ఐసీసీ ప్రణాళికలు చేయాలని పేర్కొన్నాడు.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాతినిథ్యం వహించిన ఈ ఆసీస్ క్రికెటర్, జట్టు తిరిగి రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద అభిమాని అని.. రెండు సంవత్సరాలుగా ఆజట్టు దూరమవ్వడం ఎంతగానో నిరాశపరిచిందని హెడన్ చెప్పుకొచ్చాడు. పాక్ చాంపియన్స్ ట్రోఫి గెలవడం అంతుపట్టని అంశమని భారత్‌పై పాక్ గెలుస్తుందని ఊహించలేదని హెడన్ వాపోయాడు.