
కోహ్లి–అనుష్క... ప్రేమలో ఉన్నపుడే అందరికంటా పడ్డారు. మొదట కాదన్నారు. తర్వాత ప్రణయం నిజమేనన్నారు. చెట్టాపట్టాలేసుకొని ప్రపంచాన్నే చుట్టొచ్చారు. ఇది అప్పటి సంగతి. మరి ఇప్పుడు కూడా అంతే... పెళ్లి వార్తలతో అందరికంటా పడ్డారు. కానీ బయటికి మాత్రం... కాదన్నారు. ఇటలీలో పెళ్లంటే నిజం లేదన్నారు. తీరా పెళ్లి బాజా మోగుతున్నా కూడా అదే గోప్యత పాటించారు. కానీ దాచినా దాగని మీడియా, సోషల్ మీడియా పెళ్లి తంతుపై ముందే కూసింది. అయిపోయిన పెళ్లికి ఈ తప్పెట్లు, తాళాలేంటని ఇప్పుడు అనుకున్నాడేమో కోహ్లి... ఎట్టకేలకు ట్విట్టర్‌లో అధికారికంగా తమ వివాహం జరిగిందని చెప్పుకొచ్చాడు. పెళ్లి వేడుకలోని ఫొటోలను పంచుకున్నాడు. వారం రోజులుగా మీడియాను ముంచెత్తిన పెళ్లి వార్తలకు ముగింపు పలికాడు.
ముంబై: దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ‘విరుష్క’ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటైంది. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి సోమవారం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహమాడాడు. ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. మనోర్ హౌజ్‌లోని నాలుగు విల్లాలను ఈ వేడుక కోసం ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ఇందులోని విలాసవంతమైన 22 గదుల్లో 44 మంది అతిథులు బస చేయవచ్చు. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులే ఈ పెళ్లికి విచ్చేశారు.
ఈ జంట త్వరలోనే ముంబై వర్లీ ప్రాంతంలోని కొత్త ఇంటిలో కాపురం పెడుతుందని అనుష్క సన్నిహితురాలు తెలిపింది. ప్రేమ కలాపాలతో ‘విరుష్క’గా చిరపరిచితమైన ఇద్దరి వయస్సు 29. నాలుగేళ్ల క్రితం ఓ కమర్షియల్ యాడ్ చిత్రీకరణ సందర్భంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత కాలంలో మరింత బలపడి తాజాగా పెళ్లిదాకా వచ్చింది. రిసెప్షన్ మాత్రం రెండు నగరాల్లో జరగనుంది. ఈ నెల 21న న్యూఢిల్లీలో తమ బంధువుల కోసం, 26న ముంబైలో క్రికెటర్లకు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలకు రిసెప్షన్ నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజే కోహ్లి జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా సిరీస్‌కు బయలుదేరుతాడు.
ఈ రోజు (సోమవారం) మేమిద్దరం కలకాలం కలిసుంటామనే పెళ్లి ప్రమాణం చేశాం. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల ప్రేమాభిమానాలతో ఈ అందమైన రోజు మాకెంతో ప్రత్యేకం. మా పెళ్లి ప్రయాణంలో శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్స్.
– ట్విట్టర్‌లో కోహ్లి, అనుష్క శర్మ
Comments
Please login to add a commentAdd a comment