
టీమిండియాదే పైచేయి
ఇంగ్లండ్తో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా ఆధిక్యంలోని నిలిచింది.
ముంబై: ఇంగ్లండ్తో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా ఆధిక్యంలోని నిలిచింది. తొలుత ఇంగ్లండ్ ను తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులకు కట్టడి చేసిన భారత్.. ఆ తరువాత మూడో రోజు ఆట ముగిసే సమయానికి తన మొదటి ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసి పైచేయి సాధించింది. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ మురళీ విజయ్(136;282 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో ఆకట్టుకోగా, కెప్టెన్ విరాట్ కోహ్లి(147 బ్యాటింగ్;241 బంతుల్లో 17ఫోర్లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ జోడి మూడో వికెట్కు 116 పరుగులు జోడించి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, జట్టు స్కోరు 262 పరుగుల వద్ద ఉండగా విజయ్ నిష్ర్రమించడంతో ఆపై స్వల్ప వ్యవధిలో టీమిండియా కొన్ని కీలక వికెట్లను చేజార్చుకుంది. భారత్ ఆటగాళ్లలో కరణ్ నాయర్(13),పార్థీవ్ పటేల్(15),అశ్విన్ (0)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో అలీ, రషిద్,రూట్లకు తలో రెండు వికెట్లు లభించగా, బాల్ కు వికెట్ దక్కింది.
అంతకుముందు 146/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ రోజు ఆటలో ఇన్నింగ్స్ రెండో బంతికే పూజారా(47)ను బాల్ అవుట్ చేయడంతో భారత్ రెండో వికెట్ను కోల్పోయింది. కాగా, విరాట్ పలు కీలక భాగస్వామ్యాలను సాధించడంతో టీమిండియా తేరుకుంది.
తొలి సెషన్లో భారత్ నిలకడ
ఈ రోజు ఆటలో లంచ్ సమయం వరకూ భారత్ అత్యంత నిలకడగా ఆడింది. తొలి సెషన్ పూర్తియ్య సరికి రెండు వికెట్ల నష్టానికి 247 పరుగులతో అత్యంత పటిష్ట స్థితిలో నిలిచింది. మురళీ విజయ్-కోహ్లిల చక్కటి సహకారంతో భారత్ దూసుకుపోయింది. . పూజారా నిష్క్రమణ తరువాత క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లి ఎటువంటి తడబాడు లేకుండా స్కోరును పెంచుకుంటూ పోయాడు. దీనిలో భాగంగానే విజయ్ తో కలిసి వందకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే విజయ్ శతకం సాధించాడు.
రెండో సెషన్లో తడబాటు
లంచ్ తరువాత భారత్ తడబాటుకు గురైంది. జట్టు స్కోరు 262 పరుగుల వద్ద విజయ్ మూడో వికెట్ గా పెవిలియన్ చేరిన తరువాత వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. కరణ్ నాయర్ , పార్థీవ్ పటేల్, అశ్విన్ వికెట్లను వరుసగా నష్టపోయింది. దాంతో టీ విరామ సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 348 పరుగులను చేసిన భారత్ ..నాలుగు వందల మార్కును చేరడం గగనంగా అనిపించింది. కాగా, జడేజాతో కలిసి విరాట్ ఇన్నింగ్స్ ను సమయోచితంగా నడిపించాడు. మంచి బంతులను వదిలిపెడుతూనే, చెడ్డ బంతులను మాత్రం బౌండరీ దాటిస్తూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు.
మూడో సెషన్లో భారత్ జోరు
మూడో సెషన్ లో భారత్ జోరు కొనసాగింది. ఈ సెషన్ ఆదిలో జడేజాతో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు.ఈ జోడి ఏడో వికెట్ కు 57 పరుగులు చేసిన అనంతరం జడేజా అవుటయ్యాడు. దాంతో 364 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ నష్టపోయింది. ఆ తరుణంలో విరాట్ తో కలిసిని జయంత్ యాదవ్ అత్యంత బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ రోజు ఆటలో విరాట్-జయంత్ల జోడి 87 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని జత చేయడంతో భారత్ ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలోనే విరాట్ తన కెరీర్లో 15వ టెస్టు సెంచరీ సాధించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విరాట్ కు జతగా జయంత్ యాదవ్(30 బ్యాటింగ్; 86 బంతుల్లో 3 ఫోర్లు) క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 51 పరుగుల ఆధిక్యంలో ఉంది.