వరల్డ్ కప్ ఇంగ్లండ్ గెలిచిందా!
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ‘ట్విట్టర్’ ద్వారా మాటల్లో కూడా తన దూకుడును ప్రదర్శిస్తున్నాడు. భారత్‌లో ఒలింపిక్స్ అనంతరం జరుగుతున్న సంబరాల గురించి ఇంగ్లండ్ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యకు అతను ఇచ్చిన జవాబు సోషల్ నెట్‌వర్క్‌లో సూపర్ హిట్ అయింది. ‘120 కోట్ల జనాభా ఉన్న దేశంలో 2 పతకాలు సాధిస్తేనే పిచ్చిగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇది చాలా చిరాగ్గా అనిపిస్తోంది’ అని పియర్స్ మోర్గాన్ అనే సీనియర్ పాత్రికేయుడు ట్వీట్ చేశాడు.
దీనికి వీరూ తనదైన శైలిలో జవాబిచ్చాడు. ‘మేం చిన్నచిన్న ఆనందాలను కూడా వేడుకగా జరుపుకుంటాం. కానీ క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లండ్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు. అయినా వరల్డ్ కప్ ఆడుతుండటం మాకూ చిరాగ్గానే అనిపిస్తోంది’ అని చెలరేగాడు. దాంతో సెహ్వాగ్‌పై అభినందనల వర్షం కురిసింది. ‘మైదానంలో, మైదానం బయట వీరూ భాయ్‌ను ఎవరూ ఓడించలేరు. దీన్నే కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటారు’ అని కోహ్లి స్పందించాడు.