
షార్ట్ సర్క్యూట్ తో రెజ్లర్ దుర్మరణం
జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్న ఓ 25 ఏళ్ల రెజ్లర్ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది.
న్యూఢిల్లీ:జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న ఓ 25 ఏళ్ల రెజ్లర్ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. గత రెండు రోజుల క్రితం రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో విశాల్ కుమార్ వర్మ అనే రెజ్లర్ కరెంట్ షాక్ తో దుర్మరణం చెందారు. ఇటీవల కురిసిన వర్షాలకు స్టేడియంలోకి వర్షపు నీరు చేరడంతో షార్ట్ సర్క్యూట్ అయి విశాల్ మృత్యువాత పడ్డారు. తొలుత ప్రాక్టీస్ కు సిద్ధమైన విశాల్ కరెంట్ షాక్ తో అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.
అతని మృతిపట్ల జార్ఖండ్ రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బోలా నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. విశాల్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. కేంద్ర క్రీడాశాఖ నుంచి రూ. 10 లక్షలు ఇప్పించడానికి యత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అతని కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.లక్షను ప్రకటించారు. దాంతో పాటు ప్రతీనెల రూ.10 వేలను అతని కుటుంబానికి రాష్ట్ర అసోసియేన్ ఇస్తుందన్నారు. 2005లో రెజ్లింగ్ కెరీర్ ను విశాల్ ఆరంభించాడు. ఇటీవల జాతీయ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ సెమీ ఫైనల్స్ కు చేరి సత్తా చాటుకున్నాడు.