
‘స్మార్ట్' గా సన్నద్ధం కావాలి!
కోల్‌కతా: సొంతగడ్డపై భారత్ సాధించిన విజయాల విలువను తక్కువ చేయరాదని, అయితే విదేశాల్లో గెలుపు అమితమైన సంతృప్తినిస్తుందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయ పడ్డాడు. బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో అతను ఎంఏకే పటౌడీ స్మారకోపన్యాసం చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్ష్మణ్... ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలాంటి సిరీస్‌లకు ముందు ప్రత్యేక తరహాలో సన్నద్ధం కావాలని సూచించాడు.
‘వాస్తవానికి ఈ సీజన్‌లో ఉత్తరాదిన పరిస్థితులు విదేశీ పిచ్‌లకు సరిగ్గా సరిపోయే విధంగా ఉంటాయి. కానీ మన పర్యటన బిజీలో భారత ఆటగాళ్లెవరూ దేశవాళీ క్రికెట్ ఆడటం లేదు. కాబట్టి ప్రత్యామ్నాయాలు ఆలోచించి తెలివిగా సన్నద్ధం కావాలి.’ అని లక్ష్మణ్ అన్నాడు.
టెస్టు క్రికెట్‌ను బతికించుకోవాలనే కోణంలో డే అండ్ నైట్ టెస్టులలాంటి ప్రయోగం చేయడం తప్పేమీ కాదని అతను మద్దతు పలికాడు. చకింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బౌలర్లపై తనకు సానుభూతి ఉందన్న వీవీఎస్, ప్రాథమిక స్థాయిలోనే కోచ్‌లు యాక్షన్‌ను సరిదిద్దాలని సూచించాడు.