
సాక్షి, హైదరాబాద్: వీవీఎస్ లక్ష్మణ్ పేరు చెప్పగానే మరో ఆలోచనకు తావు లేకుండా ప్రతీ క్రికెట్ అభిమాని దృష్టిలో 2001 నాటి కోల్‌కతా టెస్టు ఇన్నింగ్స్ కళ్ల ముందు మెదులుతుంది. ఆస్ట్రేలియాపై ఫాలోఆన్‌లో లక్ష్మణ్ చేసిన 281 పరుగులతో ఆ మ్యాచ్ నెగ్గిన భారత్ ఆ తర్వాత సిరీస్ కూడా గెలుచుకుంది. భవిష్యత్తులో భారత క్రికెట్ రాతను కూడా ఈ మ్యాచ్ మార్చేసింది. అయితే స్వయంగా లక్ష్మణ్ దృష్టిలో మాత్రం దీనికంటే ముందు సిడ్నీలో తాను చేసిన 167 పరుగుల ఇన్నింగ్స్‌కే తొలి స్థానం దక్కుతుంది. గురువారం తన ఆత్మకథ ‘281 అండ్ బియాండ్’ ఆవిష్కరణ సందర్భంగా అతను ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘టెస్టుల్లో అడుగుపెట్టి మూడేళ్లు దాటిపోయినా తొలి సెంచరీ నమోదు చేయలేకపోయాను. అలాంటి స్థితిలో 2000 జనవరిలో సిడ్నీలో సాధించిన శతకం నేనూ అంతర్జాతీయ క్రికెటర్‌గా నిలబడగలననే నమ్మకాన్ని కలిగించింది.
అక్కడి పిచ్, ఎదుర్కొన్న బౌలర్లు, నా ఫామ్ ప్రకారం చూస్తే రెండో ఇన్నింగ్స్‌లో చేసిన ఆ సెంచరీ గొప్పతనం ఎక్కువ. నాటి మ్యాచ్ స్థితిని పరిగణనలోకి తీసుకుంటే ఈడెన్ గార్డెన్స్‌లో చేసిన 281 పరుగులకు చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని అంగీకరిస్తాను. అయితే ఆ మ్యాచ్‌లో నా ఆట నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. అంతకుముందు దాదాపు ఏడాది కాలంగా దేశవాళీలో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటం అలవాటుగా మార్చుకున్నాను. నా ఫిట్‌నెస్ కూడా అద్భుతంగా మలచుకున్నాను. కాబట్టి ఏమాత్రం అలసట తెలీకుండా రెండు రోజులు ఆడేశాను’ అని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నాడు. ఓపెనర్ స్థానంలో ఆడేందుకు అంగీకరించకపోవడం తన కెరీర్‌లో కఠిన నిర్ణయమని వీవీఎస్ చెప్పాడు. మూడేళ్ల పాటు మిడిలార్డర్‌లో స్థానం లేక ఇక భారత్ తరఫున ఆడాలనే విషయాన్ని మర్చిపోయి దేశవాళీపైనే దృష్టి పెట్టినట్లు అతను పేర్కొన్నాడు. ఆటగాడిగా ఉన్నప్పుడు అంతర్ముఖుడిగా కనిపించిన లక్ష్మణ్... తాను కూడా సహచరులతో చాలా సరదాగా గడిపే వాడినని వెల్లడించాడు. గంభీరంగా ఉండే అనిల్ కుంబ్లేతో కూడా 2008 నాగపూర్ టెస్టు తర్వాత టేబుల్ పైన డ్యాన్స్ చేయించగలగడం తనకే సాధ్యమైందని లక్ష్మణ్ నవ్వుతూ చెప్పాడు.
అమెరికాలో అనుసరించా...
పుస్కకావిష్కరణకు అతిథిగా వచ్చిన రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) మాట్లాడుతూ... క్రికెట్ వీరాభిమానినైన తాను కోల్‌కతా ఇన్నింగ్స్ సమయంలో అమెరికాలో ఉన్నానని, ప్రస్తుతం ఉన్న తరహాలో నెట్‌లో వీక్షించే సదుపాయం లేకపోవడంతో రెడిఫ్‌లో వచ్చే సంక్షిప్త సమాచారం ఆధారంగా మ్యాచ్‌ను అనుసరించానని గుర్తు చేసుకున్నారు. లక్ష్మణ్ సహచర హైదరాబాదీ కావడం గర్వంగా ఉందని భారత బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ వ్యాఖ్యానించగా... అండర్–16 స్థాయిలో వీవీఎస్‌ను ప్రోత్సహించిన రోజులను మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్ జ్ఞప్తికి తెచ్చుకున్నారు. లక్ష్మణ్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన చాలా సందర్భాల్లో తాను ఇచ్చిన బ్యాట్‌లనే వాడాడని వెంకటపతిరాజు చెప్పగా... టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేయలేకపోవడం, వరల్డ్ కప్ ఆడలేకపోవడం వీవీఎస్ కెరీర్‌లో లోటుగా మిగిలిపోయానని అతని మేనమామ, మెంటార్ బాబా కృష్ణమోహన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment