ఏబీ కాదు.. వాట్సన్!
హైదరాబాద్: ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ ను ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా పూర్తిగా జట్టుకు దూరం కాగా, రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా పలు మ్యాచ్ల నుంచి వైదొలుగుతున్నాడు. అతను భుజం గాయం నుంచి ఇంకా కోలుకోపోవడంతో ఆర్సీబీ ఆరంభపు మ్యాచ్లకు దూరమవుతున్నాడు. దాంతో విరాట్ స్థానంలో ఆ జట్టు తాత్కాలిక సారథిగా ఏబీ డివిలియర్స్ కు బాధ్యతలు అప్పజెప్పాలని ఆర్సీబీ తొలుత భావిచింది. ఈ మేరకు సన్ రైజర్స్ హైదరాబాద్ తో బుధవారం జరిగే మ్యాచ్కు తమ కెప్టెన్ ఏబీ అంటూ ఆ జట్టు ప్రధాన కోచ్ డానియల్ వెటోరి కూడా ఒక ప్రకటన చేశాడు.
అయితే ఏబీ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్(సీఎస్ఏ) చేసిన ట్వీట్ ఆందోళనలో పడేసింది. ప్రస్తుతం ఆర్సీబీతో డివిలియర్స్ కలిసినప్పటికీ ప్రారంభపు మ్యాచ్లో అతను పాల్గొనడం లేదు. అతని స్థానంలో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఆర్సీబీ జట్టులో కోహ్లి, డివిలియర్స్ లు గైర్హాజరీ అయితే వారి స్థానాన్ని వాట్సన్ భర్తీ చేయనున్నట్లు వెటోరి తెలిపాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న డివిలియర్స్ కోలుకోవడానికి మరికొంత సమయం అవసరమన్నాడు. ఇదిలా ఉంచితే ఆ జట్టు డాషింగ్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కూడా గాయంతో టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకునే అవకాశాలు కనబడుతున్నాయి.