అతడిని తీసుకుని రిస్క్ చేశాం: ధోని
లాడర్హిల్: వెస్టిండీస్ తో జరిగిన రెండో టి20లో అమిత్ మిశ్రాను తీసుకుని రిస్క్ చేశామని టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని అన్నాడు. అమిత్ మిశ్రా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో టి20 వర్షం కారణంగా రద్దయింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని మాట్లాడుతూ.. ‘మా బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. 150 ఛేదించదగిన స్కోరు. అయితే మేమే గెలుస్తామని కచ్చితంగా చెప్పలేను. మా బ్యాటింగ్ బలంగా ఉంది. బిన్నీ స్థానంలో అమిత్ మిశ్రాను తీసుకుని కొద్దిగా రిస్క్ చేశాం. ఎందుకంటే మాకు ఒక బ్యాట్స్మన్ తగ్గుతాడు. అయితే ఈ వికెట్ కు లెగ్ స్పిన్నర్ అవసరమని భావించి అమిత్ మిశ్రాను తీసుకున్నాం. అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అశ్విన్ నుంచి అతడికి మంచి సహకారం లభించింది. ఇద్దరూ మంచి ప్రదర్శన చేశారు. అమెరికాలో మరిన్ని మ్యాచ్ లు నిర్వహించాలని కోరుకుంటున్నాన’ని చెప్పాడు.