
సచిన్‌ను తొలి బంతికే అవుట్ చేయాలని ఉంది : వెస్టిండీస్ కెప్టెన్ స్యామీ
కోల్‌కతా: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చివరి టెస్టులో ప్రత్యర్థులుగా ఆడటం తమకు గర్వకారణంగా ఉందని, అయితే అతడిని తొలి బంతికే అవుట్ చేయాలనే కోరిక కూడా ఉందని వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ డారెన్ స్యామీ అన్నాడు. ‘సచిన్ చివరి మ్యాచ్‌లో అతడిని అవుట్ చేసిన బౌలర్ చరిత్రలో నిలుస్తాడు. కాబట్టి మాస్టర్‌ను అవుట్ చేయాలని మా జట్టులో ప్రతి బౌలర్ తహతహలాడుతున్నాడు. ఆఖరి టెస్టు సమయంలో వాతావరణం కచ్చితంగా ఉద్విగ్నంగా ఉంటుంది. కానీ అంత గొప్ప మ్యాచ్‌లో గెలవడం ఇంకా బాగుంటుంది. కాబట్టి మేం మరింత కష్టపడతాం’ అని స్యామీ చెప్పాడు. 2011లో సచిన్ వందో సెంచరీ కోసం అందరూ ఎదురుచూస్తున్న సమయంలో వెస్టిండీస్ షాక్ ఇచ్చింది. 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సచిన్ ఇచ్చిన క్యాచ్‌ను స్యామీ అందుకుని యావత్ భారతదేశాన్ని నిరాశపరిచాడు. ఈసారి కూడా తమ దగ్గర అలాంటి ప్రణాళికలే ఉన్నాయని విండీస్ కెప్టెన్ చెప్పాడు.
సచిన్ ఎంతోమందితో పాటు తనకు కూడా హీరోనే అని చెప్పాడు. ‘సచిన్‌ను ఇష్టపడని వారెవరైనా ఉంటారా? అలాంటి దిగ్గజాలు ఎప్పటికీ ఆడుతూనే ఉండాలని కోరుకోవాలి. తను ఇకపై ఆడడనే విషయం మాకే ఎలాగో అనిపిస్తోంది. కాబట్టి కోట్లాది మంది భారతీయుల మనోభావాలని మేం అర్థం చేసుకోగలం’ అని స్యామీ చెప్పాడు. తమలో చాలామంది సచిన్ పలకరిస్తేనే పొంగిపోతారని, కనిపించిన ప్రతి ఒక్కరినీ గుడ్‌మార్నింగ్ అంటూ విష్ చేసే గొప్ప వ్యక్తని మాస్టర్‌ను పొగడ్తల్లో ముంచెత్తాడు. పదేళ్ల క్రితం తాను సచిన్ దగ్గర తీసుకున్న ఆటోగ్రాఫ్‌ను జాగ్రత్తగా భద్రపరచుకున్నానని స్యామీ చెప్పాడు.