
న్యూఢిల్లీ:టీమిండియాతో జరిగిన తొలి టీ 20లో ఘోర పరాజయం పట్ల న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ ఓటమికి పూర్తి బాధ్యత యావత్ జట్టుగా విఫలం కావడమే ప్రధాన కారణమన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన విలియమ్సన్.. ఫీల్డ్ లో తమ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని అసహనం వ్యక్తం చేశాడు. మరొకవైపు టీమిండియా అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుని విజయం సాధించిందని విలియమ్సన్ పేర్కొన్నాడు.
'మా ఆట తీరు పూర్తిగా నిరాశపరిచింది. ఫీల్డ్ లో చాలా పేలవమైన ఆటను కనబరిచాం. మమ్మల్ని క్షమించుకోవడానికి అర్హత లేని ప్రదర్శన చేశాం. ఓవరాల్ గా స్పిన్నర్లు కొంతవరకూ ఆకట్టుకుంటే, మా బౌలర్లు విఫలమయ్యారు. మేము ఓడిపోవడానికి మా చెత్త బౌలింగ్ ముఖ్యం కారణం. అదే క్రమంలో భారత జట్టు అమోఘంగా రాణించింది. మాకు ఏ ఒక్క ఛాన్స్ వారు ఇవ్వలేదు. మేము ఆకట్టుకునే ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. మిగతా మ్యాచ్ ల్లో సమష్టిగా పోరాడతాం'అని విలియమ్సన్ తెలిపాడు.
ఇదిలా ఉంచితే, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆశిష్ నెహ్రాకు విలియమ్సన్ అభినందనలు తెలియజేశాడు. 'నెహ్రాతో కలిసి చాలా మ్యాచ్ లు ఆడాను. అతనొక జెంటిల్మెన్ క్రికెటర్. ఆన్ ఫీల్డ్ లోనూ ఆఫ్ ఫీల్డ్ లోనూ నెహ్రా ఎప్పుడూ హుందాగా ఉంటాడు'అని విలియమ్సన్ తెలిపాడు.