ఎదురులేదనుకున్న బ్యాటింగ్ ఆర్డర్ చెల్లాచెదురైంది. ప్రభావం చూపెట్టాల్సిన బౌలింగ్ తేలిపోయింది. మొత్తానికి భారత్ ఆట గాడి తప్పింది. వేగం పెంచాల్సిన చోట వికెట్లను కోల్పోవడం... ఆ తర్వాత ఏమాత్రం జోరందుకోలేకపోవడం... టీమిండియా భారీస్కోరుకు కళ్లెం వేసింది. విండీస్ ముందుగా బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించింది. అనంతరం బ్యాటింగ్ మెరుపులతో సులువుగా నెగ్గింది. కీలకదశలో భారత ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం కూడా వారికి కలిసొచ్చింది.
తిరువనంతపురం: ప్రత్యర్థి జోరు ముందు భారత్ తలవంచింది. బ్యాటింగ్‌లో ఎదురుదాడి, బౌలింగ్‌లో వాడి లేక రెండో టి20లో టీమిండియా ఓడింది. ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో విరాట్ కోహ్లి బృందాన్ని ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–1తో నిలిచింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. శివమ్ దూబే (30 బంతుల్లో 54; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా, పంత్ (22 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సిమన్స్ (45 బంతుల్లో 67 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) జట్టు గెలిచేదాకా భారత బౌలర్లతో తలపడ్డాడు. లూయిస్ (35 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు.
ఓపెనర్ల వైఫల్యం...
టాస్ నెగ్గిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. భారత్ మార్పుల్లేకుండా బరిలోకి దిగగా... విండీస్ తుది జట్టులో రామ్‌దిన్ స్థానంలో నికోలస్ పూరన్‌ను తీసుకుంది. అయితే భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు రాహుల్ (11; 1 ఫోర్), రోహిత్ శర్మ (15; 2 ఫోర్లు) శుభారంభం అందించలేకపోయారు. నాలుగో ఓవర్లోనే రాహుల్‌ను పియరీ పెవిలియన్ చేర్చగా... మరో నాలుగు ఓవర్లకు హోల్డర్ బంతిని అంచనా వేయడంలో విఫలమైన రోహిత్ క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో 56 పరుగులకే ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు.
జోరుకు బ్రేకులు...
భారత్ 8వ ఓవర్లో 50 పరుగుల్ని పూర్తిచేసుకుంది. కానీ దూబే తాండవంతో 11వ ఓవర్లోనే వందకు చేరింది. రాకెట్ వేగాన్ని అందుకున్నాక విండీస్ బౌలర్లు పట్టుబిగించడంతో వెనక్కి తగ్గింది. దూబే ఔటైన కాసేపటికే కోహ్లి, శ్రేయస్ అయ్యర్ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో పరుగుల వేగం ఒక్కసారిగా మందగించింది. విలియమ్స్ బౌలింగ్‌లో ఫ్రంట్‌ఫుట్ ఆడేందుకు వచి్చ... ఆఖరి క్షణాల్లో కట్ చేయబోయిన కోహ్లి (17 బంతుల్లో 19; 2 ఫోర్లు) షార్ట్ థర్డ్ మ్యాన్ వద్ద సిమన్స్ చేతికి చిక్కాడు. అయ్యర్ (10; 1 ఫోర్)ను వాల్ష్ ఔట్ చేశాడు. మెరుపులు మెరిపించాల్సిన ఆఖరి ఓవర్లలో జడేజా (9), సుందర్ (0)ల వికెట్లు రాలడంతో భారత్ చేసేదేమీ లేకపోయింది. 11 ఓవర్లలో 100 పరుగులు చేసిన భారత్ ఆఖరి 9 ఓవర్లలో 70 పరుగులకే పరిమితమైంది.
చకచకా ఛేదన...
విండీస్ ఓపెనర్లు సిమన్స్, లూయిస్ విజయానికి అవసరమైన ఆరంభానిచ్చారు. లూయిస్ చెలరేగుతుంటే ఓపిక పట్టిన సిమన్స్ లక్ష్యఛేదనకు అవసరమైన రన్‌రేట్ పడిపోకుండా జాగ్రత్తపడ్డాడు. వ్యక్తిగత స్కోరు 6 పరుగుల వద్ద సిమన్స్ ఇచ్చిన క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ వదిలేశాడు. 9 ఓవర్లయినా భారత బౌలర్లెవరూ ఈ జోడీని విడగొట్టలేకపోయారు. పదో ఓవర్ వేసిన సుందర్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టేందుకు క్రీజ్ వదిలిన లూయిస్ స్టంపౌట్ అయ్యాడు. దీంతో 73 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత సిమన్స్‌కు హెట్‌మైర్ (14 బంతుల్లో 23; 3 సిక్స్‌లు) జతయ్యాడు. భారీ సిక్సర్లు బాదిన హెట్‌మైర్... కోహ్లి పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు వెనుదిరిగాడు. తర్వాత పూరన్ (18 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండతో సిమన్స్ 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. చేతిలో పుష్కలంగా వికెట్లు ఉండటంతో సిమన్స్ బ్యాట్‌కు పనిచెప్పాడు. అవతలివైపు పూరన్ దూకుడు పెంచడంతో లక్ష్యఛేదనలో విండీస్ చకచకా సాగిపోయింది. భారత్ చేతిలో వరుసగా ఏడు పరాజయాల తర్వాత తొలి విజయం సాధించింది.
శివమ్... తాండవం
బ్యాటింగ్ ఆర్డర్‌లో కోహ్లి స్థానంలో ప్రమోషన్‌లో వచ్చిన శివమ్ దూబే ఆరంభంలో కాస్త ఇబ్బంది పడినా... తర్వాత విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పొలార్డ్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో అయితే ఒక్కసారిగా చెలరేగాడు. కెపె్టన్ బౌలింగ్‌లో దూబే మూడు భారీ సిక్సర్లు బాదాడు. బౌన్సర్లు వేస్తే మిడ్‌వికెట్ మీదుగా రెండు సిక్సర్లు కొట్టిన శివమ్... ఆఫ్‌స్టంప్ ఆవల పడిన ఫుల్‌టాస్ బంతిని పాయింట్ వైపు ఫ్లాట్ సిక్స్‌గా మలిచాడు. 3 వైడ్లతో సుదీర్ఘంగా సాగిన ఈ ఓవర్లో 26 పరుగులొచ్చాయి. దూబే 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో కెరీర్‌లో తొలి ఫిఫ్టీ బాదాడు. మొదటి 14 బంతులకు 12 పరుగులే చేసిన శివమ్ మరో 13 బంతులెదుర్కొనేసరికీ అర్ధసెంచరే పూర్తయ్యింది. వాల్ష్ వేసిన 11వ ఓవర్లో భారీషాట్‌కు ప్రయత్నించి హెట్‌మైర్ చేతికి చిక్కాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) హోల్డర్ 15; రాహుల్ (సి) హెట్‌మైర్ (బి) పియరీ 11; శివమ్ దూబే (సి) హెట్‌మైర్ (బి) వాల్ష్ 54; కోహ్లి (సి) సిమన్స్ (బి) విలియమ్స్ 19; పంత్ (నాటౌట్) 33; శ్రేయస్ (సి) కింగ్ (బి) వాల్ష్ 10; జడేజా (బి) విలియమ్స్ 9; సుందర్ (సి అండ్ బి) కాట్రెల్ 0; దీపక్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–24, 2–56, 3–97, 4–120, 5–144, 6–164, 7–167. బౌలింగ్: కాట్రెల్ 4–0–27–1, పియరీ 2–0–11–1, హోల్డర్ 4–0–42–1, విలియమ్స్ 4–0–30–2, పొలార్డ్ 2–0–29–0, వాల్ష్ 4–0–28–2.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: లెండిల్ సిమన్స్ (నాటౌట్) 67; ఎవిన్ లూయిస్ (స్టంప్డ్) పంత్ (బి) సుందర్ 40; హెట్‌మైర్ (సి) కోహ్లి (బి) జడేజా 23; పూరన్ (నాటౌట్) 38; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–73, 2–112. బౌలింగ్: దీపక్ చాహర్ 3.3–0–35–0, భువనేశ్వర్ 4–0–36–0, సుందర్ 4–0–26–1, చహల్ 3–0–36–0, దూబే 2–0–18–0, జడేజా 2–0–22–1.
Comments
Please login to add a commentAdd a comment