న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టులపై తన అభిమానాన్ని ప్రదర్శించాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మనుగడ సాగించాలంటే టెస్టు ఫార్మాట్‌కు అమిత ప్రాధాన్యత ఇవ్వాలని అతను అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) నిర్వహించిన వార్షిక సమ్మేళనంలో కోహ్లి పాల్గొన్నాడు. ‘నా దృష్టిలో టెస్టు క్రికెట్టే అత్యుత్తమ ఫార్మాట్. క్రికెట్ బతకాలంటే దీనిపై ఆసక్తి తగ్గవద్దు. టెస్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టమని ఈతరం కుర్రాళ్లకు నా సలహా’ అని కోహ్లి అన్నాడు. ఈ కార్యక్రమంలో భారత దిగ్గజాలు బిషన్ సింగ్ బేడి, మొహిందర్ అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు. ‘నేను అండర్–14, అండర్–16 మ్యాచ్‌లు ఆడిన సమయంలో బేడి కోచ్‌గా ఉన్నారు.
అప్పట్లో ఆయన శిక్షణ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు మాత్రం అది నా జీవితంలో భాగంగా మారిపోయింది. ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవం’ అని విరాట్ తన మనసులో మాట చెప్పాడు. ఈ సందర్భంగా కోహ్లి గురించి మాట్లాడుతూ... ‘మైదానంలో కోహ్లి ప్రదర్శించే కొన్ని హావభావాలు నాకు నచ్చవు. అయితే మైదానంలో అంత తీవ్ర స్వభావంతో కనిపించే భారత క్రికెటర్‌ను నేను గతంలో ఎప్పుడూ చూడలేదు. మున్ముందు అతనిలోని ఆ కోణం మెత్తబడవచ్చు కానీ విరాట్‌ను చూసి నేను ఎంతో నేర్చుకున్నాను’ అని బేడి ప్రశంసలు కురిపించారు. మరోవైపు దేశవాళీ క్రికెట్‌లో రెడ్, బ్లూ, గ్రీన్‌వంటి రంగుల జట్ల పేర్లతో టోర్నీని నిర్వహించడం ఏమిటంటూ బేడి తన సహజ శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment