క్రికెట్‌లో దొంగాట...! | Wild Card Entries In Krishna Cricket Team Without Selections | Sakshi
Sakshi News home page

క్రికెట్‌లో దొంగాట...!

Published Wed, Sep 26 2018 1:48 PM | Last Updated on Wed, Sep 26 2018 1:48 PM

Wild Card Entries In Krishna Cricket Team Without Selections - Sakshi

కడప స్పోర్ట్స్‌:  క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో తల్లిదండ్రుల బలహీనతలను క్రికెట్‌ అసోసియేషన్లు సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సెలెక్షన్స్‌కు హాజరుకాకపోయినా వైల్డ్‌కార్డు ఎంట్రీగా నేరుగా మ్యాచ్‌ల్లో దించడంపై పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పారదర్శకంగా జట్లను ఎంపిక చేస్తున్నామని చెప్పుకుంటూ సెలెక్షన్‌ ట్రయల్స్‌కు పిలుస్తుంటారని, కానీ ఆయా కేటగిరీల్లో జిల్లా జట్లను ముందుగానే పేపర్‌పై రాసుకొని ఎంపిక చేస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందుకు బలం చేకూరేలా తాజాగా కృష్ణా జిల్లా అండర్‌ –14 బాలుర క్రికెట్‌ జట్టులో 16 మందిని ప్రధాన జట్టుకు, మరో 5గురిని స్టాండ్‌బైగా ఎంపిక చేసినట్లు ఈ నెల 4వ తేదీన అధికారికంగా ప్రకటించి జట్టు ఎంపికకు సెలెక్షన్స్‌ ట్రయల్స్‌ నిర్వహించి అందులో నుంచి ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌ను నాలుగు జట్లుగా విభజించి సెలెక్షన్‌ మ్యాచ్‌లు కూడా నిర్వహించి తుదిజట్టును ఎంపిక చేసినట్లు సమాచారం.

తాజాగా కడప నగరంలో నిర్వహిస్తున్న ఏసీఏ అండర్‌–14 బాలుర అంతర్‌ జిల్లాల క్రికెట్‌ టోర్నీలో ఆడుతున్న కృష్ణా జిల్లా జట్టులో రెండు అక్షరాలు పేరుగల ఓ క్రీడాకారున్ని ఆడించడంపై విమర్శలు తలెత్తాయి. ఈ క్రీడాకారుడు సెలెక్షన్స్‌ ట్రయల్స్‌కు గానీ, మ్యాచ్‌లకు గాని హాజరుకాలేదు. కడపలో జరిగిన రెండు మ్యాచ్‌ల తర్వాత ఆ క్రీడాకారున్ని మూడో మ్యాచ్‌లో దించడంతో మిగిలిన జట్టు సభ్యులు, అలాగే వారి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. 11 మంది ఆడే ఆటకు స్టాండ్‌బైతో కలిపి 21 మందిని ఎంపిక చేసినప్పుడు వాళ్లందర్నీ కాదని, సెలెక్షన్స్‌ ట్రయల్స్‌లో పాల్గొనని వారిని తీసుకొచ్చి ఆడించడం చర్చనీయాంశమైంది. ఈ 21 మందిలో ఎవరికి వారు తమకు కూడా అవకాశం వస్తుందనే ఆశతో ఉంటారు. అలాంటిది వారి ఆశలపై ఆదిలోనే చిన్న వయసులోనే నీళ్లు చల్లడం దుర్మార్గమని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. సాక్షాత్తు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్, బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఉన్న రాజధాని జిల్లాల నుంచే ఇటువంటి ఎంపికలు జరుగుతున్నప్పుడు మిగిలిన జిల్లాల పరిస్థితి వేరే చెప్పనక్కరలేదు. దీంతో పాటు ఓవర్‌ ఏజ్‌ క్రీడాకారులను సైతం తీసుకువచ్చి ఆడిస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

నైతికంగా ఏమేర కరెక్టో..
దేశీయ, అంతర్జాతీయస్థాయి మ్యాచ్‌లలో క్రీడాకారులు గాయాలపాలైనా.. లేదా కూర్పులో మార్పు అవసరమైనప్పుడు వారి స్థానంలో ఇతర క్రీడాకారులను రప్పించి ఆడటం మనందరికి తెలిసిందే. అయితే క్రికెట్‌కు పునాదిదశగా భావించే జోనల్‌స్థాయి అండర్‌–14 క్రికెట్‌ పోటీల్లో ఈస్థాయిలో ప్రత్యేకంగా అనుమతులు పొంది.. ఇక్కడికి రప్పించి ఆడించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. అసోసియేషన్‌ వారు ఎంపిక చేసిన స్టాండ్‌బై నుంచి తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ వాటన్నింటినీ పక్కన పెట్టి ఏసీఏ అనుమతి తీసుకుని ఆగమేఘాల మీద మ్యాచ్‌లో ఆడించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒక వేళ ఆ క్రీడాకారుడు రాష్ట్రస్థాయిలో రాణించిన ట్రాక్‌ రికార్డు ఉంటే ఆ క్రీడాకారుడి ఎంపికలకు రాకపోయినప్పటికీ సదరు క్రీడాకారుడు పేరును జట్టుతో పాటు ప్రకటించడం ఆనవాయితీ. అయితే అండర్‌–14 స్థాయి నుంచే అటువంటి సంప్రదాయాలన్నింటీ పక్కనపెట్టి ఆడించడం ఏమేర సబబో ఏసీఏ పెద్దలే ఆలోచించాలి. జట్టు అవసరాల దృష్ట్యా కూర్పులో భాగంగా క్రీడాకారులను ఆడించే అధికారం జిల్లా క్రికెట్‌ సంఘ కార్యదర్శులకు ఉన్నాయన్న ధైర్యమే వీరిని ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరించేలా చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

కృష్ణా జిల్లా అసోసియేషన్‌నుంచి లేఖ వచ్చింది..
కృష్ణా జట్టు ఎంపికలు మా పరిధిలోవి కావు. కృష్ణా జిల్లా అసోసియేషన్‌ వారు రెండ్రోజుల క్రితం ఏసీఏ అనుమతితో క్రీడాకారున్ని జట్టులో చేర్చాలంటూ లేఖ రాశారు. దీంతో మ్యాచ్‌లకు మేము అనుమతించాం. ఈ విషయమై కృష్ణా జిల్లా కార్యదర్శితో మాట్లాడగా.. రెగ్యులర్‌ క్రీడాకారుడు కావడంతో ఏసీఏ అనుమతితో కడపలో జరిగే మ్యాచ్‌లకు పంపినట్లు తెలిపారు. అదే విధంగా ఓవర్‌ఏజ్‌ క్రీడాకారుల విషయంపై అన్ని జిల్లాల అసోసియేషన్‌లకు సమాచారం పంపించాం.– ఎం. వెంకటశివారెడ్డి, ఏసీఏఉపాధ్యక్షుడు, కడప

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement