
‘ప్రాక్టీస్’ సరిపోతుందా!
వాంగేరి: బ్యాటింగ్‌లో కాస్త చెమటోడ్చినా... బౌలర్లు వైఫల్యం కావడంతో వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న భారత జట్టు ఇప్పుడు టెస్టు సిరీస్‌పై దృష్టి పెట్టింది. గత రెండు నెలల నుంచి ఒక్క విజయం కూడా సాధించని ధోని సేన కనీసం ఐదు రోజుల ఫార్మాట్‌లోనైనా సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఎలెవన్‌తో తలపడనుంది. గత వైఫల్యాలను మర్చిపోయి వార్మప్ మ్యాచ్‌తో గాడిలో పడాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అయితే రెండు రోజుల ప్రాక్టీస్ సరిపోతుందా? లేదా? అన్నది సందేహంగా మారింది.
భారత్ బ్యాటింగ్ బలోపేతం
టెస్టు స్పెషలిస్ట్‌లు చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్‌ల రాకతో భారత టెస్టు జట్టు మరింత బలోపేతం అయ్యింది. అయితే కీలక సమయంలో వీళ్లు ఎలా ఆడతారో చూడాలి. ఈ మ్యాచ్‌లో కోహ్లికి విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. ఇదే జరిగితే అంబటి రాయుడు తుది జట్టులోకి వస్తాడు. వన్డేల్లో ఘోరంగా విఫలమైన ఇషాంత్, భువనేశ్వర్‌లు ప్రాక్టీస్ మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే జహీర్‌కు తోడుగా ఉమేశ్, షమీలు బౌలింగ్ బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది. వన్డేల్లో విఫలమైన అశ్విన్, రవీంద్ర జడేజాలలో ఎవరికి చాన్స్ ఇస్తారన్నది ఆసక్తికరం. దక్షిణాఫ్రికాలో ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోయినా... టెస్టు సిరీస్‌లో ధోనిసేన మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మరి కివీస్ గడ్డపై అపజయాలకు అడ్డుకట్ట వేస్తారో లేదో చూడాలి.