సన్ రైజర్స్ జోరు కొనసాగిస్తుందా? | will sunrisers achieve another victory in home ground | Sakshi
Sakshi News home page

సన్ రైజర్స్ జోరు కొనసాగిస్తుందా?

Published Sat, May 6 2017 3:56 PM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

సన్ రైజర్స్ జోరు కొనసాగిస్తుందా?

సన్ రైజర్స్ జోరు కొనసాగిస్తుందా?

హైదరాబాద్‌: ఇప్పటివరకూ సొంత మైదానంలో ఓటమి ఎరుగని సన్ రైజర్స్ హైదరాబాద్ మరో విజయంపై కన్నేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా శనివారం నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తొలుత ఫీల్డింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. సన్ రైజర్స్ జట్టులోకి ఆశిష్ నెహ్రా, బిపుల్ శర్మలు తిరిగి జట్టులోకి వచ్చారు. పుణే వేదికగా జరిగిన మ్యాచ్‌లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ముందుంది.


ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌ అవకాశాలను పటిష్టం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ప్రస్తుతం పుణే 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా... సన్‌రైజర్స్‌ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీ ఆరంభంలో తడబడినా... కీలక సమయంలో పుంజుకొని పుణే వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆ జట్టు ఆడిన చివరి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు ఉండటం విశేషం. ఇదే జోరులో మరో గెలుపు కోసం పుణే బరిలోకి దిగుతోంది. మరోవైపు ఉప్పల్‌లో ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్‌ విజయం సాధించి అజేయంగా ఉంది. వరుసగా ఆరో విజయంపై ఆ జట్టు దృష్టి సారించింది.

ఫామ్‌లో ఉన్న స్టోక్స్, త్రిపాఠి

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి... గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్‌ స్టోక్స్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పుణేకు విజయాన్ని అందించారు. మరోసారి త్రిపాఠి శుభారంభం అందించడంతో పాటు... కెప్టెన్‌ స్మిత్, వికెట్‌ కీపర్‌ ధోని బ్యాట్‌ ఝుళిపిస్తే పుణే భారీ స్కోరు చేయడం ఖాయం. ఇప్పటి వరకు జట్టు గెలిచిన ప్రతీ మ్యాచ్‌లోనూ కొత్త హీరో పుట్టుకొచ్చాడు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు బౌలర్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేస్తున్నారు. స్పిన్నర్‌ తాహిర్‌తో పాటు పేసర్‌ ఉనాద్కట్, వాషింగ్టన్‌ సుందర్‌ రాణిస్తున్నారు.

ఢిల్లీలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమి పాలైన సన్‌రైజర్స్‌ తిరిగి పట్టు బిగించాలని చూస్తోంది. అయితే సొంత వేదికపై విజయపరంపరను కొనసాగించాలనే పట్టుదలతో హైదరాబాద్‌ కెప్టెన్‌ వార్నర్‌ ఉన్నాడు. కోల్‌కతా మ్యాచ్‌లో పెను విధ్వంసాన్ని సృష్టించిన వార్నర్‌తో పాటు, శిఖర్‌ ధావన్, హెన్రిక్స్, కేన్‌ విలియమ్సన్‌ మంచి ఫామ్‌లో ఉండటం జట్టకు కలిసొచ్చే అంశం. యువరాజ్‌ సింగ్‌ కూడా కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. గత మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ సన్‌ బౌలింగ్‌ విభాగాన్ని తక్కువ చేయలేం. డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు బౌలర్‌ భువనేశ్వర్, లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తమ విలువేంటో ఇప్పటికే తెలియ జేశారు. వెటరన్‌ స్టార్‌ ఆశిష్‌ నెహ్రాతో పాటు యువ బౌలర్లు సిరాజ్, సిద్ధార్థ్‌ కౌల్‌ రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం.  

రైజింగ్ పుణె తుది జట్టు:స్టీవ్ స్మిత్(కెప్టెన్), అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠి, మనోజ్ తివారి, బెన్ స్టోక్స్, ఎంఎస్ ధోని, క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉనాద్కత్, ఇమ్రాన్ తాహీర్

సన్ రైజర్స్ తుది జట్టు; డేవిడ్ వార్నర్(కెప్టెన్),శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, యువరాజ్ సింగ్, హెన్రిక్యూస్, నమాన్ ఓజా, బిపుల్ శర్మ,భువనేశ్వర్, రషిద్ ఖాన్, సిద్ధార్ధ కౌల్, ఆశిష్ నెహ్రా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement