సన్ రైజర్స్ కు సాధారణ లక్ష్యం
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ 149 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పుణె ఆదిలోనే రాహుల్ త్రిపాఠి(1)వికెట్ ను కో్ల్పోయింది. అనవసర పరుగు కోసం యత్నించిన త్రిపాఠి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తరుణంలో అజింక్యా రహానేకు స్టీవ్ స్మిత్ జతకలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు.
అయితే జట్టు స్కోరు 39 పరుగుల వద్ద రహానే(22) రెండో వికెట్ గా అవుట్ కావడంతో పుణె గాడి తప్పినట్లు కనబడింది. కాగా, స్మిత్-బెన్ స్టోక్స్ లు 60 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో పుణె తిరిగి తేరుకుంది. అయితే స్టోక్స్(39), స్మిత్ (34)లు రెండు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరారు. అయితే చివర్లో మహేంద్ర సింగ్ ధోని(31;21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో పుణె నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో సిద్ధార్ద్ కౌల్ నాలుగు వికెట్లతో రాణించగా, రషిద్ ఖాన్, బిపుల్ శర్మలకు తలో వికెట్ దక్కింది.