లండన్: అంతర్జాతీయ టెన్నిస్‌లోకి వేగంగా దూసుకొచ్చిన గ్రీస్ యువ సంచలనం స్టెఫనోస్ సిట్సిపాస్ ప్రతిష్టాత్మక విజయంతో సత్తా చాటాడు. వరల్డ్ టాప్–8 ఆటగాళ్లు పాల్గొన్న సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సిట్సిపాస్ విజేతగా నిలిచాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు ఇంకా ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీ కూడా నెగ్గకపోయినా... దిగ్గజ ఆటగాళ్లను దాటి అతను ఈ ఏడాది చివరి టోర్నీ అయిన ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్‌ను చేజిక్కించుకోవడం విశేషం. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ఆరో సీడ్ సిట్సిపాస్ 2 గంటల 35 నిమిషాల్లో 6–7 (6/8), 6–2, 7–6 (7/4) స్కోరుతో ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. 21 ఏళ్ల 3 నెలల వయసులో ఏటీపీ ఫైనల్స్ టైటిల్ సాధించిన సిట్సిపాస్... 2001 (నాడు 20 ఏళ్ల లీటన్ హెవిట్) తర్వాత అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఫైనల్స్ చేరిన తొలి సీజన్‌లోనే సిట్సిపాస్ విజేతగా నిలవడం మరో చెప్పుకోదగ్గ విశేషం. ఫైనల్ పోరులో తొలి సెట్ సుదీర్ఘ ర్యాలీలతో సాగింది. ఇద్దరి మధ్య సాగిన హోరాహోరీ పోరుతో సెట్ టైబ్రేక్‌కు చేరింది. ఇక్కడ అద్భుతమైన ఫోర్‌హ్యాండ్‌లతో దాడి చేసిన థీమ్ దూసుకుపోయాడు. 5–6 వద్ద సిట్సిపాస్ ఒక సెట్ పాయింట్‌ను కాపాడుకోగలిగినా, ఆ తర్వాత థీమ్ పదునైన సర్వీస్‌ను రిటర్న్ చేయలేక సెట్ కోల్పోయాడు. అయితే సిట్సిపాస్ రెండో సెట్‌లో పట్టుదలగా నిలబడ్డాడు.
తొలి గేమ్‌ను గెలుచుకున్న అనం తరం చక్కటి వాలీ, ఫోర్ హ్యాండ్ విన్నర్లతో ‘డబుల్ బ్రేక్’ సాధించాడు. ఈ ఒక్క సెట్‌లోనే అతను 10 విన్నర్లు కొట్టడం విశేషం. తుది ఫలితం మూడో సెట్‌కు చేరిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు పోటా పోటీగా తలపడ్డారు. ముందుగా 1–1తో స్కోరు సాగగా, బ్యాక్‌హ్యాండ్ విఫలం కావడంతో ఒత్తిడికి లోనైన థీమ్ 1–3తో వెనుకబడ్డాడు. అయితే వెంటనే వరుసగా మూడు గేమ్ లు గెలుచుకొని 4–3తో ముందంజలో నిలిచాడు. కానీ స్కోరు మళ్లీ టైబ్రేక్‌కు చేరింది. ఇక్క డా 4–0తో సిట్సిపాస్ ఆధిక్యంలో నిలిచిన తర్వాత స్కోరు మళ్లీ 4–4తో సమమైంది. ఈ దశలో ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా సిట్సిపాస్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి మ్యాచ్‌ను ముగించాడు. తొలి సెట్ ఓడిన తర్వాత ఒక ఆటగాడు టైటిల్ సాధించడం 2005 (నల్బందియన్–అర్జెంటీనా) తర్వాత ఇదే మొదటిసారి. సిట్సిపాస్‌కు 26 లక్షల 56 వేల డాలర్లు (రూ.19 కోట్ల 8 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ప్రస్థానం...ప్రశంసనీయం
సాక్షి క్రీడావిభాగం: రెండేళ్ల క్రితం ఇటలీలోని మిలాన్‌లో జరిగిన నెక్ట్స్ జనరేషన్ ఏటీపీ ఫైనల్స్‌ను సిట్సిపాస్ ప్రేక్షకుడిగా చూశాడు. ప్రపంచంలోని అత్యుత్తమ అండర్–21 ఆటగాళ్ల కోసం ఏటీపీ కొత్తగా ప్రవేశపెట్టిన టోర్నీ అది. సరిగ్గా ఏడాది తర్వాత అదే టోర్నీలో బరిలోకి దిగిన అతను విజేతగా నిలిచాడు. ఇప్పుడు మరో సంవత్సరం తిరిగేలోగా అసలైన ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను చేజిక్కించుకొని సగర్వంగా నిలిచాడు. ఈ గ్రీక్ ఆటగాడి ప్రస్థానం ఎంత వేగంగా సాగిందో తాజా ఫలితంతో అర్థమవుతుంది. 2018లో జనరేషన్ నెక్ట్స్ ట్రోఫీ నెగ్గాక రాబోయే ఏడాది కోసం అతను తనకంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాడు. అందులో ఏటీపీ ఫైనల్స్‌లో ఆడాలనేది తన కల అంటూ చాలా సార్లు అతను చెప్పుకున్నాడు. గత నెలలో షాంఘై ఓపెన్‌లో జొకోవిచ్‌ను ఓడించిన తర్వాత అతనికి ఫైనల్స్‌లో చోటు ఖాయమైంది. సీజన్ చివరి టోర్నీకి అర్హత సాధించడమే కాదు సిట్సిపాస్ చాంపియన్‌గా కూడా నిలవడం విశేషం.
2016లో జూనియర్ వరల్డ్ నంబర్‌వన్‌గా ఉన్నప్పుడు ఇదే టోర్నీకి స్పేరింగ్ (ప్రాక్టీస్) పార్ట్‌నర్‌గా కూడా సిట్సిపాస్ వచ్చాడు. నాడు తనతో కలిసి ఆడిన థీమ్‌పైనే ఆదివారం ఫైనల్లో అతను గెలుపొందాడు. 2019 సిట్సిపాస్‌కు అద్భుతంగా సాగింది. టాప్–10లో ఉన్న ఆటగాళ్లలో 9 మందిపై అతను విజయాలు సాధించడం చెప్పుకోదగ్గ ఘనత. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫెడరర్‌ను ఓడించడంతో ఈ గ్రీస్ ఆటగాడిపై అందరి దృష్టీ పడింది. తాజా ఏటీపీ ఫైనల్స్ గ్రూప్ విభాగంలో మెద్వెదేవ్, జ్వెరేవ్‌లపై నెగ్గి నాదల్ చేతిలో ఓడిపోయాడు. అయితే సెమీస్‌లో ఫెడరర్‌పై సాధించిన చక్కటి విజయం అతనికి ఊపు తెచ్చింది. తమ దేశ ప్రధాని కిరియాకొస్ మిట్సొటకిస్ స్వయంగా మ్యాచ్‌కు హాజరై ప్రోత్సహిస్తుండగా అదే జోరులో టైటిల్ కూడా గెలుచుకున్నాడు. రాబోయే 2020లో సిట్సిపాస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా గ్రాండ్‌స్లామ్ టైటిల్ కొట్టగలడని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ 6వ ర్యాంక్‌తో అతను ఈ ఏడాదిని ముగిస్తున్నాడు. తాజా ఫామ్ చూస్తే అంతర్జాతీయ టెన్నిస్‌పై తనదైన ముద్ర వేయగల సామర్థ్యం అతనిలో ఉందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు
7 ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే విజేతగా నిలిచిన ఏడో ప్లేయర్ సిట్సిపాస్. గతంలో దిమిత్రోవ్ (బల్గేరియా–2017లో), అలెక్స్ కొరెత్యా (స్పెయిన్–1998లో), జాన్ మెకన్రో (అమెరికా– 1978లో), గిలెర్మో విలాస్ (అర్జెంటీనా–1974లో), ఇలీ నస్టాసే (రొమేనియా–1971లో), స్టాన్ స్మిత్ (అమెరికా–1970లో) ఈ ఘనత సాధించారు.
2 వరుసగా నాలుగేళ్లు ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో కొత్త ప్లేయర్ విజేతగా నిలువడం ఇది రెండోసారి. ఆండీ ముర్రే (2016), దిమిత్రోవ్ (2017), జ్వెరెవ్ (2018) గత మూడేళ్లలో చాంపియన్స్‌గా నిలిచారు. 1988 నుంచి 1991 మధ్య ఇలాగే జరిగింది. గతంలో బోరిస్ బెకర్ (1988), స్టెఫాన్ ఎడ్బర్గ్ (1989), ఆండ్రీ అగస్సీ (1990), పీట్ సంప్రాస్ (1991) ఈ టైటిల్స్‌ను గెలిచారు.
రెండో సెట్‌లో నేను అంత బాగా ఎలా ఆడగలిగానో ఇప్పటికీ అర్థం కావడం లేదు. బహుశా తుది ఫలితం గురించి అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఆడటం వల్ల అలాంటి ప్రదర్శన వచ్చిందేమో. అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్స్ ఆరంభంలో నా ఆటపై నేనే అసహనానికి గురయ్యాను. బ్రేక్ పాయింట్లు కోల్పోయాను. సర్వీస్ నిలబెట్టుకోలేకపోయాను. టై బ్రేక్ దాకా వెళ్లాల్సి వచ్చింది. అయితే చివరకు అత్యుత్తమంగా నిలవడం సంతోషం. ప్రేక్షకులు నాకు మద్దతు పలకడం కూడా నాలో ఉత్సాహాన్ని పెంచింది. ఈ ట్రోఫీని అందుకోవడం చాలా గర్వంగా అనిపిస్తోంది.
– సిట్సిపాస్
Comments
Please login to add a commentAdd a comment