విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ సమరానికి నేడు తెరలేవనుంది. మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లు కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ మెరుపులతో టి20లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ కోస్టల్ రైడర్స్, రన్నరప్ బెజవాడ టైగర్స్‌ల మధ్య బుధవారం జరిగే పోరుతో రెండో సీజన్ మొదలవుతుంది. ప్రతి రోజు రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నెల 27న టైటిల్ పోరు నిర్వహిస్తారు.
పోటీలన్నీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలోనే జరుగుతాయి. తొలి సీజన్‌లో ఆఖరి మెట్టుపై తడబడి టైటిల్ కోల్పోయిన బెజవాడ టైగర్స్ ఈ సారి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. హిట్టర్ రికీ భుయ్‌పై గంపెడాశలు పెట్టుకున్న ఈ ఫ్రాంచైజీ రూ.8.10 లక్షలతో అతన్ని రిటెయిన్ చేసుకుంది. ఏపీఎల్‌లో ఇదే అత్యధిక మొత్తం కాగా, ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో నిరూపించుకున్న ఆంధ్ర క్రికెటర్లు హనుమ విహారి, కోన శ్రీకర్ భరత్‌లు కూడా ఈ లీగ్‌లో ఆడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
విహారి రాయలసీమ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రూ. 6.60 లక్షలతో కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది. ఈ జట్టులో అతనిదే అత్యధిక పారితోషికం. భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ ఉత్తరాంధ్ర లయన్స్ తరఫున స్టార్‌గా బరిలో ఉన్నాడు. అతన్ని రూ. 6 లక్షలకు లయన్స్ కొనుగోలు చేసింది. వీళ్లతో పాటు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అకాడమీలలో రాణించిన కుర్రాళ్లు ఈ లీగ్‌తో ఏసీఏ సెలక్టర్ల కంట పడాలని ఆశిస్తున్నారు.
‘మన ఆంధ్ర–మన ఏపీఎల్’ అనే నినాదంతో పూర్తిగా స్థానిక కుర్రాళ్లకే అవకాశమిచ్చిన ఈ లీగ్‌ను చూసే ప్రేక్షకులకు కూడా నిర్వాహకులు బంపరాఫర్ ప్రకటించారు. ఏపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చే ప్రేక్షకులకు లక్కీ డ్రాను ఏర్పాటు చేశారు. విజేతగా నిలిచిన క్రికెట్ అభిమానులకు ఈ స్టేడియంలో భారత్, ఆ్రస్టేలియాల మధ్య నవంబర్ 23న జరిగే టి20 మ్యాచ్ టికెట్లను ఉచితంగా బహుకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment