‘టెస్టు’ బతకాలంటే సచిన్ ఆడాలి
న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్ కోసం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కొనసాగాలని శ్రీలంక మాజీ సారథి అర్జున రణతుంగ అభిప్రాయపడ్డారు. ‘సుమారు రెండున్నర దశాబ్దాలు క్రికెట్‌లో కొనసాగినా... ఏ మాత్రం గర్వం లేని ఒకే ఒక్క క్రికెటర్ సచిన్. అతను ఇసుమంతైన మారలేదు. ఇంకా లక్ష పరుగులు చేసినా అతను మారడు’అని రణతుంగ మాస్టర్ వినయాన్ని కొనియాడారు. సచిన్ ఆడటం సంప్రదాయ క్రికెట్‌కు లాభిస్తుందని చెప్పారు. ఫిక్కీ నిర్వహించిన సెమినార్‌లో పాల్గొనేందుకు వచ్చిన రణతుంగ మీడియాతో మాట్లాడుతూ ‘టెండూల్కర్ ఇంకొంత కాలం కొనసాగాలని నేను కోరుకుంటున్నాను.
టెస్టులకు సచిన్‌లాంటి ఆటగాళ్ల అవసరం ఎంతో ఉంది. సంప్రదాయ క్రికెట్ బతకాలంటే అతను ఆడటమే ఉత్తమం’ అని అన్నారు. ఆటగాళ్లు తీసుకునే రిటైర్మెంట్ నిర్ణయాలపై ఆయన స్పందిస్తూ తను గుడ్‌బై చెప్పాలనుకున్నప్పుడు కేవలం మూడు రోజుల సమయమే పట్టిందన్నారు. తనకు క్రికెట్ కాకుండా వేరే వ్యాపకాలున్నాయని వ్యాపారం, రాజకీయాల్లోనూ క్రియాశీలంగా వ్యవహరించానని చెప్పారు. కానీ సచిన్‌కు మాత్రం క్రికెట్టే లోకమని 49 ఏళ్ల రణతుంగ చెప్పుకొచ్చారు.