
నిజ్నీ నొవ్‌గోరడ్: ఇంగ్లండ్ కెప్టెన్, స్ట్రయికర్ హ్యారీ కేన్ ‘హ్యాట్రిక్’ తుఫాన్‌లో పనామా విలవిల్లాడింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తమ అత్యధిక గోల్స్‌తో చరిత్రకెక్కే విజయాన్ని నమోదు చేసింది. కేన్ సేన ఉరిమే ఉత్సాహంతో తొలి అర్ధభాగంలోనే పనామా పనైపోయింది. గ్రూప్ ‘జి’లో ఆదివారం జరిగిన ఈ పోరులో ఇంగ్లండ్ 6–1తో పనామాపై జయభేరి మోగించింది. వరుసగా రెండు విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్ తరఫున హ్యారీ కేన్ మూడు గోల్స్ (22వ, 45+1వ, 62వ నిమిషాల్లో) చేయగా... జాన్ స్టోన్స్ రెండు (8వ, 40వ నిమిషాల్లో)... లిన్‌గార్డ్ (36వ నిమిషంలో) ఒక గోల్ సాధించారు. పనామా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను ఫిలిప్ బెలోయ్(78వ ని.) సాధించాడు
. ఆరంభం నుంచే ఎదురులేని ఇంగ్లండ్ దాడులకు పనామా చెల్లాచెదురైంది. ఈ మ్యాచ్‌లో ఎక్కడా తగ్గని ఇంగ్లండ్ 8వ నిమిషంలోనే గోల్స్ బోణీ కొట్టింది. ప్రత్యర్థి గోల్‌పోస్ట్ కార్నర్ నుంచి ట్రిప్పియెర్ ఇచ్చిన పాస్‌ను కనిపెట్టుకున్న స్టోన్స్ ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా హెడర్‌తో గోల్ చేశాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో స్టోన్స్‌కిదే తొలి గోల్. అనంతరం ఇంగ్లండ్ తమ జోరు కొనసాగించగా... పనామా డీలా పడిపోయిం ది. గురువారం బెల్జియంతో జరిగే మ్యాచ్ ఫలితంతో గ్రూప్ టాపర్ ఎవరో తేలుతుంది. బెల్జియం కూడా ఇప్పటికే నాకౌట్‌కు చేరింది. రెండో మ్యాచ్‌ల్లోనే 5 గోల్స్‌తో కేన్ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు.
►5 ఇంగ్లండ్ చరిత్రలో తొలి అర్ధభాగంలోనే ఐదు గోల్స్ చేయడం ఇదే తొలిసారి.
►3 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తరఫున హ్యాట్రిక్ చేసిన మూడో ఆటగాడు కేన్. జెఫ్ హర్ట్స్ (1966), గ్యారీ లినేకర్ (1986) హ్యాట్రిక్ సాధించారు.
►1 ఇంగ్లండ్ వరల్డ్‌కప్ చరిత్రలో అతిపెద్ద (6–1) విజయమిది.
Comments
Please login to add a commentAdd a comment