
ఆక్లాండ్ (ఈడెన్ పార్క్)
ప్రపంచకప్ మరో 13 రోజుల్లో
న్యూజిలాండ్‌లో అతి పెద్ద స్టేడియం ఈడెన్ పార్క్. 1910 నుంచి ఆక్లాండ్ క్రికెట్‌కు సొంత స్టేడియంగా ఉంది. 1925 నుంచి ఇక్కడ రగ్బీని కూడా నిర్వహిస్తున్నారు. ఆక్లాండ్ నగరం మధ్యలో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. 1950లో ఎంపైర్ గేమ్స్‌కు, 1987లో ప్రారంభ రగ్బీ వరల్డ్ కప్, 2011లో రగ్బీ ప్రపంచకప్, 1992 ఐసీసీ ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ఇది ఆతిథ్యమిచ్చింది. 1955-56లో ఇదే మైదానంలో విండీస్‌ను ఓడించిన కివీస్ టెస్టుల్లో తొలి విజయాన్ని అందుకుంది. అదే సమయంలో అత్యంత చెత్త రికార్డును కూడా న్యూజిలాండ్ మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టెస్టులో 26 పరుగులకే ఆలౌటైంది.
అధిక తేమ, ఉప ఉష్టమండల పరిస్థితుల వల్ల ఇక్కడి పిచ్ స్లో అండ్ స్పిన్ బౌలర్లకు సహకరిస్తుంది. స్టేడియం సామర్థ్యం 50 వేలు. ఇక ఆక్లాండ్ విషయానికొస్తే అద్భుతమైన, సహజసిద్ధమైన ప్రకృతి సంపద అభిమానులను కట్టిపడేస్తుంది. సుందరమైన బీచ్‌లు, రకరకాల పార్క్‌లు, సహజ సిద్ధంగా ఏర్పడిన లోయలు, కొండలు, సెలయేర్లు, ఆహార పదార్థాలు, వైన్లు, షాపింగ్ కాంప్లెక్స్, నైట్‌లైఫ్ కల్చర్, అడ్వెంచర్స్ మతిపోగొడతాయి.
ఈ స్టేడియంలో ఫిబ్రవరి 28న ఆసీస్, కివీస్; మార్చి 7న దక్షిణాఫ్రికా, పాక్; 14న భారత్, జింబాబ్వేల మ్యాచ్‌లు జరుగుతాయి. దీంతో పాటు మార్చి 24న సెమీస్-1 జరుగుతుంది.