
ప్రపంచ క్రికెట్‌ను శాసించింది వెస్టిండీస్. ఇది కరీబియన్ క్రికెట్ గతం... ఘనం. ప్రపంచకప్‌లో ఎదురులేదనిపించింది వెస్టిండీస్. ఇది ఒకప్పటి మాట. కానీ... ఈ మాట ఓ మూటగా అటకెక్కింది. విండీస్ క్రికెట్ అథఃపాతాళానికి పడిపోయింది. అది ఎంతగా అంటే... అప్పట్లో తమకు పోటీరాని జట్లపై సాటిలేని విజయాలు సాధించిన జట్టే... ఇప్పుడు మెగా ఈవెంట్ అర్హత కోసం కూనలతో తలపడాల్సినంత దైన్యంగా తయారైంది. ఇదంతా వెస్టిండీస్ కథైతే... ఇప్పుడు ప్రపంచకప్ క్వాలిఫయింగ్ గురించి తెలుసుకుందాం...
హరారే
ప్రపంచకప్ క్వాలిఫయింగ్ ఆటకు నేటి నుంచి తెరలేవనుంది. ఈ ‘రెండు బెర్తుల’ (తుది అర్హత 2 జట్లకే) పోటీలకు జింబాబ్వే ఆతిథ్యమిస్తుంది. బరిలో పది జట్లున్నా... 2019 వన్డే ప్రపంచకప్ వేదిక ఇంగ్లండ్‌కు చేరే సత్తా వెస్టిండీస్, అఫ్గానిస్తాన్‌లకే ఉండొచ్చు. ఎటువంటి సంచలనాలు లేకపోతే తుదకు అర్హత సాధించేవి ఆ రెండు జట్లేననే అంచనాలున్నాయి. జాసన్ హోల్డర్ నాయకత్వంలోని విండీస్ జట్టు క్రిస్ గేల్, కార్లోస్ బ్రాత్‌వైట్, ఇవిన్ లూయిస్, మార్లోన్ శామ్యూల్స్‌లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే వార్మప్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ చేతిలో విండీస్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో విండీస్ తన ప్రత్యర్థి జట్లను తక్కువ అంచనా వేస్తే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశముంది.
పది జట్లతోనే ప్రపంచకప్...
గతంలో వన్డే ప్రపంచకప్ 12 జట్లతో, 14 జట్లతోనూ జరిగాయి. బోర్ మ్యాచ్‌లు బోలెడు ఉండేవి. దీంతో చప్పగా సాగే ప్రపంచకప్‌కు చరమగీతం పాడుతూ మేటి పది జట్లకే ఈ భాగ్యం కల్పించారు. అయితే తమ అసోసియేట్, అఫీలియేట్ జట్లకు న్యాయం చేయలనుకుంది ఐసీసీ. ఈ ఉద్దేశంతోనే ర్యాంకింగ్స్‌లో టాప్–10లో మొదటి 8 జట్లకే నేరుగా ప్రపంచకప్ ఆడే అవకాశమిచ్చింది. మిగతా రెండు బెర్తుల కోసం క్వాలిఫయింగ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. అంటే ర్యాంకింగ్స్‌లో దిగువన ఉన్న జట్లు, ఐసీసీ శాశ్వత సభ్య దేశాలు (విండీస్, జింబాబ్వే, ఐర్లాండ్, అఫ్గాన్)తో పాటు మరో ఆరు అసోసియేట్, అఫీలియేట్ జట్లు ఈ అర్హత పోటీల్లో తలపడతాయి. ఇందులో చివరకు విజేత, రన్నరప్ జట్లు ఇంగ్లండ్ బయల్దేరతాయి.
మిగతా ఆరు జట్ల సంగతేంటి?
ఐసీసీలో అసోసియేట్, అఫీలియేట్ జట్లు ఎన్నో ఉన్నాయి. కానీ ఆరు జట్లే అర్హతకెలా వచ్చాయంటే... నెదర్లాండ్స్, స్కాట్లాండ్, హాంకాంగ్, పపువా న్యూగినియాలు ప్రపంచ క్రికెట్ లీగ్ (డబ్ల్యూసీఎల్) చాంపియన్‌షిప్ ద్వారా (టాప్–4) అర్హత పొందాయి. మిగతా రెండు జట్లు యూఏఈ, నేపాల్ డబ్ల్యూసీఎల్ డివిజన్–2 టోర్నీ ద్వారా క్వాలిఫయింగ్ ఛాన్స్ దక్కించుకున్నాయి.
లైవ్ లేదు... డీఆర్‌ఎస్ లేదు
గతంలో ప్రపంచకప్ అర్హత కోసం క్రికెట్ లీగ్ డివిజన్, చాంపియన్‌షిప్‌లు నిర్వహించారు. కానీ ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. అయితే ఈసారి ఐసీసీ బ్రాడ్‌కాస్ట్ చేయాలనుకుంది. స్టార్ నెట్ వర్క్ వద్ద హక్కులున్నాయి. కానీ స్టార్ చానెళ్లు తమకు గిట్టుబాటు కాదనో లేక ఇతరాత్ర కారణాలేవైనా... ఏవో కొన్ని తప్ప మొత్తం అన్ని మ్యాచ్‌లను ప్రసారం చేయడం లేదు. దీంతో అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్)కి అవకాశం లేదు. పైగా డీఆర్‌ఎస్ ఆర్థికంగా కూడా భారమే!
అఫ్గాన్, స్కాట్లాండ్‌ల మధ్య తొలి పోరు
పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. మొత్తం 34 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్ ‘ఎ’లో వెస్టిండీస్, ఐర్లాండ్, పపువా న్యూగినియా, యూఏఈ... గ్రూప్ ‘బి’లో అఫ్గానిస్తాన్, నేపాల్, హాంకాంగ్, స్కాట్లాండ్, జింబాబ్వే జట్లున్నాయి. ఒక్కో గ్రూపు నుంచి మూడేసి జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో టాప్–2 జట్లు ఫైనల్ చేరతాయి. అఫ్గాన్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో క్వాలిఫయింగ్ పోటీలు మొదలవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment