క్రికెట్ స్టేడియంలో ఆసక్తికర సన్నివేశం
లాహోర్: ఇటీవల జరిగిన పాకిస్తాన్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన తొలి ట్వంటీ-20 ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రపంచ ఎలెవన్ జట్టు క్రికెటర్లను రెండు ప్రత్యేక ఆటోలలో లాహోర్ స్డేడియంలోకి ఆహ్వానించారు. అయితే ఆదిలోనే ఓ ఆటో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆటోలో కూర్చుని ఉన్న క్రికెటర్లే దిగి ఆ ఆటోని తోయాల్సి వచ్చింది. సాధారణంగా ఆర్టీసీ బస్సులు ఆగినప్పుడు ప్రయాణికులు దిగి బస్సును తోస్తుంటారు. ఇదే పరిస్థితి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లకు తలెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది
ట్వంటీ20 సిరీస్‌ను 2-1తో పాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే చాలా ఏళ్ల తర్వాత పాక్‌లో నిర్వహించిన అంతర్జాతీయ టోర్నీ ఇది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు తమ దేశానికి వచ్చిన వరల్డ్ ఎలెవన్ ఆటగాళ్లను వినూత్నంగా ఆటోలలో స్డేడియంలోకి తీసుకువచ్చారు. కానీ వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ డారెన్ సామి కూర్చున్న ఆటో మధ్యలో ఆగిపోయింది. దీంతో సామితో పాటు ఉన్న ఇంటర్నేషనల్ క్రికెటర్లు వెంటనే ఆటో నుంచి కిందకి దిగి వాహనాన్ని కొద్ది దూరం తోయడంతో స్టార్ట్ అయింది. క్రికెటర్లు హుషారుగా ఆటోలలో మైదానంలో తిరిగారు. కొందరు దీన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.