వరల్డ్ ఎలెవన్ క్రికెట్ జట్టు ఇదే..
లాహోర్: ఇండిపెండెన్స్ కప్ సిరీస్ లో భాగంగా పాకిస్థాన్ లో పర్యటించే వరల్డ్ ఎలెవన్ క్రికెట్ జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు దక్షిణాఫ్రికాకు చెందిన డు ప్లెసిస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 14 మంది సభ్యులతో కూడిన జట్టులో ఐదుగురు దక్షిణాఫ్రికా క్రికెటర్లకు స్థానం దక్కడం ఇక్కడ విశేషం. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టెస్టు, టీ 20 జట్టుకు సారథిగా ఉన్న డు ప్లెసిస్ ను వరల్డ్ ఎలెవన్ కెప్టెన్ నియమించగా, ఇందులో ఏడు దేశాలకు చెందిన అంతర్జాతీయ ఆటగాళ్లు ఆడుతున్నారు. అయితే పాక్ కు వెళ్లే వరల్డ్ ఎలెవన్ జట్టులో భారత ఆటగాళ్లకు స్థానం దక్కకపోవడానికి కారణం బీసీసీఐ నుంచి అనుమతి లేకపోవడమే.
వచ్చేనెల 12, 13,15 తేదీల్లో లాహోర్లోని గడాఫీ స్టేడియంలో పాకిస్థాన్-వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య మూడు టీ 20 మ్యాచ్ లు జరుగనున్నాయి. వరల్డ్ ఎలెవన్ కు జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. 2009లో లాహోర్ లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన తరువాత పాక్ కు వెళ్లడానికి ఏ అంతర్జాతీయ జట్టు ముందుకు రావడం లేదు. ఇప్పుడు వరల్డ్ ఎలెవన్ జట్టు పాక్ లో ఆడటంతో అక్కడ పూర్వవైభవం తీసుకురావాలని పీసీబీ యత్నిస్తోంది. మరొకవైపు శ్రీలంక, వెస్టిండీస్ జట్లు పాక్ పర్యటనకు అంగీకారం తెలపడం కూడా పీసీబీకి ఊరట కల్గించే విషయమే.
వరల్డ్ ఎలెవన్: డు ప్లెసిస్(కెప్టెన్-దక్షిణాఫ్రికా),హషీమ్ ఆమ్లా(దక్షిణాఫ్రికా), శామ్యూల్ బద్రీ(వెస్టిండీస్), జార్జ్ బెయిలీ(ఆస్ట్రేలియా), పాల్ కాలింగ్ వుడ్(ఇంగ్లండ్), బెన్ కట్టింగ్, గ్రాంట్ ఎలియట్(న్యూజిలాండ్), తమీమ్ ఇక్బాల్(బంగ్లాదేశ్), డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా), మోర్నీ మోర్కెల్(దక్షిణాఫ్రికా), టిమ్ పానీ(ఆస్ట్రేలియా), తిషారా పెరీరా(శ్రీలంక), ఇమ్రాన్ తాహీర్(దక్షిణాఫ్రికా), డారెన్ సామీ(వెస్టిండీస్)