యాసిర్ షా(ఫైల్)
కరాచీ: పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షాపై సస్పెన్షన్ వేటు పడటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ సెలక్టర్ హరోన్ రషీద్ అసహనం వ్యక్తం చేశారు. త్వరలో న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరనున్న తరుణంలో ఒక ఆటగాడిపై నిషేధం పడటం తమ ప్రణాళికకు తీవ్ర విఘాతం కల్గించిందన్నారు. 'పాకిస్థాన్ క్రికెట్ లో రోజూ ఏదో సమస్య. మా క్రికెట్ లో ఉదయం లేచిన దగర్నుంచి కొత్త సమస్యలు పుట్టకొస్తూనే ఉంటాయి. ఇప్పటికే పలు సమస్యలతో ఉన్న జట్టులో మళ్లీ ఇదొక సమస్య. యాసిర్ పై నిషేధంతో జట్టు కూర్పును మరొకసారి సమీక్షించాలి' అంటూ ఆటగాళ్ల వ్యవహార శైలిని రషీద్ పరోక్షంగా తప్పుబట్టారు.
ఆదివారం పాక్ స్పిన్నర్ యాసిర్ షా డోపీగా తేలడంతో అతన్ని తాత్కాలికంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఐసీసీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గత నెల 13 వ తేదీన ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్బంగా నిర్వహించిన డోపింగ్ టెస్టులో యాసిర్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. కాగా యాంటీ డోపింగ్ నిబంధనల ప్రకారం యాసిర్ మరోసారి అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ యాసిర్ డోపింగ్ పాల్పడినట్లు తదుపరి పరీక్షల్లో కూడా రుజువైతే మాత్రం అతనిపై ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పాటు నిషేధం పడే అవకాశం ఉంది.