పొరపాటున భార్య మాత్రలు వేసుకోవడం వల్లే..
లాహోర్: పాకిస్తాన్ స్పిన్నర్ యాసిర్ షా తన భార్యకు సంబంధించిన మాత్రలను పొరపాటున వేసుకోవడం వల్లే డోపింగ్ టెస్టుల్లో పాజిటివ్ గా తేలిందని ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) స్పష్టం చేసింది. ఇటీవల ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా యాసిర్ షా నిషేధిత డ్రగ్స్ ను తీసుకున్నట్లు తేలడంతో అతన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, మరోసారి అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉన్నందున అందుకు పీసీబీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే వైద్య నిపుణుల సలహా తీసుకున్న పీసీబీ.. యాసిర్ షా నిషేధాన్ని సవాల్ చేయనుంది.
'యాసిర్ భార్య బీపీ పేషెంట్. దానిలో భాగంగానే కుటుంబానికి సంబంధించిన మాత్రలు టేబుల్ పై ఒక చోటే ఉన్నాయి. యాసిర్ పొరపాటున భార్య మాత్రలను తీసుకున్నాడు ' అని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు. యాసిర్ దురుద్దేశంతో ఆ డ్రగ్స్ ను తీసుకున్నాడనటాన్ని తాము ఎంత మాత్రం నమ్మడం లేదన్నారు. క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడే అవసరం యాసిర్ కు లేదని షహర్యార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.