టీమిండియా బెర్తు కోసం నిరీక్షిస్తున్నడాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ బ్యాట్తో చెలరేగి జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
బెంగళూరు: టీమిండియా బెర్తు కోసం నిరీక్షిస్తున్నడాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ బ్యాట్తో చెలరేగి జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. వెస్టిండీస్-ఎతో ఆదివారం ఆరంభమైన అనధికారిక మూడు వన్డేల సిరీస్లో యువరాజ్ (89 బంతుల్లో 123) మెరుపు సెంచరీ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్-ఎ 77 పరుగులతో విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన యువరాజ్ సారథ్యంలోని భారత్ నిర్ణీత 42 ఓవర్లలో నాలుగు వికెట్లకు 312 పరుగులు చేసింది. యువీ మెరుపు ఇన్నింగ్స్తో రెచ్చిపోగా, యూసుఫ్ పఠాన్ (70 నాటౌట్), మన్దీప్ (67) అర్ధశతకాలతో రాణించారు. యువీ 8 ఫోర్లు, 7 సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్లను భారత బౌలర్లు 39.1 ఓవర్లలో 235 పరుగులకు కుప్పకూల్చారు. యూసుఫ్, వినయ్, రాహుల్, నర్వాల్ తలా రెండు వికెట్లు తీశారు. విండీస్ జట్టులో ఆష్లే నర్స్ (57), డియెనరైన్ (57) హాఫ్ సెంచరీలు చేసినా ఇతర బ్యాట్స్మెన్ నిరాశపరిచారు. ఇదే వేదికపై ఈ నెల 17న ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.