
ఆకట్టుకున్న జింబాబ్వే
హరారే: మూడు టీ 20ల సిరీస్లో భాగంగా శనివారం ఇక్కడ హరారే స్పోర్ట్స్ క్లబ్లో భారత్తో జరిగిన తొలి టీ 20లో జింబాబ్వే ఆకట్టుకుంది. మూడు వన్డేల సిరీస్లో ఘోరంగా విఫలమైన జింబాబ్వే.. మొదటి టీ 20లో మాత్రం మెరుగైన ప్రదర్శన కనబరిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
జింబాబ్వే ఆటగాళ్లలో చిబాబా(20), మసకద్జా(25)లు మోస్తరుగా రాణించగా, ముతాంబామి రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాత సికిందర్ రాజా(20), వాలర్(30)లు ఫర్వాలేదనిపించారు. ఈ జోడీ మూడో వికెట్ కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. అయితే చిగుంబరా (55 నాటౌట్; 26 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లు) చెలరేగడంతో జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 170 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టీమిండియా బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు సాధించగా, రిషి ధవన్, అక్షర్ పటేల్, చాహల్ లకు తలోవికెట్ దక్కింది.