సేలం: అకస్మాత్తుగా రోడ్డుమీదకు వచ్చిన ఓ తాబేలును తప్పించబోయి ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. తమిళనాడు సేలం జిల్లా ఈతాపూర్ లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయివేటు బస్సు పాండిచ్చేరి నుండి కోయంబత్తూరు కు వెళుతోంది. రోడ్డు మీద వెళుతున్న తాబేలును రక్షించే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు డ్రైవర్ మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపపడటంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.