నేడు నయూబ్ ఇమామ్ పట్టాభిషేకం
న్యూఢిల్లీ : దేశంలో ప్రసిద్ధి చెందిన జామా మసీదు నయూబ్ ఇమామ్‌గా షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారి కుమారుడికి శనివారం పట్టాభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ముస్లిం మతగురువులు, పెద్దలు హాజరుకానున్నారని బుఖారి పేర్కొన్నారు. ఈ ఉత్సవానికి చట్టబద్ధత లేదని వచ్చిన విమర్శలను ఇక్కడ మీడియా సమావేశంలో బుఖారీ తోసిపుచ్చారు. ‘ పట్టాభిషేకం ఉత్సవాన్ని నిలుపుదల చేస్తూ స్టే విధించాలని వేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించడాన్ని బుఖారీ స్వాగతించారు.
‘ నయూబ్ ఇమామ్ పట్టాభిషేకానికి చట్టబద్ధత లేదని, అక్రమమని కేంద్ర ప్రభుత్వం, వక్ఫ్‌బోర్డులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే..పట్టాభిషేక ఉత్సవం శనివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమై సుదీర్గంగా ఇరువైన్నర గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు. టునీషియా, ఈజిప్టు, మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబీయాల నుంచి ముస్లిం మతగురువులు, నాయకులు, వేల సంఖ్యలో ముస్లింలు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. వారంతా మత బోధనలు చేస్తారని చెప్పారు. అవివాహితుడైన షాబాన్ బుఖారీ అమ్నీ యూనివర్సిటీలో సామాజికశాస్త్రంలో డిగ్రీ చేస్తున్నాడు.
అతడు అతి పిన్న వయస్సులోనే దేశంలోనే అతిపెద్ద మసీదుకు నయూబ్ ఇమామ్ పదవి చేపట్టడానికి మార్గం సుమగమైందని, అనంతరం షాహీ ఇమామ్‌గా మారుతోందని చెప్పారు. 27 ఏళ్లు నయూబ్ ఇమామ్‌గా చేసిన పిదప, 2000 సంవత్సరంలో తాను ‘షాహి ఇమామ్’గా నియమితులైనట్లు బుఖారీ చెప్పారు.
ఈ ఉత్సవానికి హాజరుకావాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు బుఖారి చేసిన ఆహ్వానానికి అంగీకరించారా లేదా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం నిరాకరించారు. అయితే భారత ప్రధాని నరేంధ్ర మోదీని ఈ ఉత్సవానికి ఆహ్వానించని విషయం తెలిసిందే.. కాగా, వాస్తవానికి బుఖారీలు మధ్య ఆసియా నుంచి ఇక్కడకు వచ్చారు. 17వ శతాబ్ధంలో మొగల్‌పాలనలో..ఎర్రకోట ఎదురుగా నిర్మించిన ఈ మసీదుకు బుఖారీలు ఆపధర్మ వారసులుగా కొనసాగుతున్నారు.