అమ్మా.. మజాకా! | 3 AIADMK ministers take oath of office | Sakshi
Sakshi News home page

అమ్మా.. మజాకా!

Published Wed, May 21 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

రాష్ట్రంలోని 39, పుదుచ్చేరిలోని ఒకటి కలుపుకుని మొత్తం 40 స్థానాల్లో గెలుపొందినపుడే కేంద్రంలో పట్టుసాధిస్తామని పార్టీ క్యాడర్‌కు అన్నాడీఎంకే అధినేత్రి,

చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలోని 39, పుదుచ్చేరిలోని ఒకటి కలుపుకుని మొత్తం 40 స్థానాల్లో గెలుపొందినపుడే కేంద్రంలో పట్టుసాధిస్తామని పార్టీ క్యాడర్‌కు అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత అనేకసార్లు నూరిపోశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. 37 స్థానాల్లో గెలవగా కన్యాకుమారి, ధర్మపురి, పుదుచ్చేరి స్థానాల్లో పార్టీ పరాజయం పాలైంది. దేశమంతా అన్నాడీఎంకే విజయాన్ని ఆకాశానికి ఎత్తేసినా అమ్మ మాత్రం ఆ మూడు స్థానాలపై ఆలోచనలో పడ్డారు, తనదైన  శైలిలో ఆరాతీశారు. అంతే ఇంకేముంది ముగ్గురు మంత్రులపై వేటుపడింది.
 
 కొందరు పార్టీ పదవులను కోల్పోయారు. కన్యాకుమారిలో అన్నాడీఎంకే అభ్యర్థి మూడోస్థానానికి దిగజారడంతో అక్కడి ఇన్‌చార్జ్ మంత్రి పచ్చయమ్మాల్ పదవి కోల్పోయారు. ఈరోడ్ ఇన్‌చార్జ్ మంత్రి దామోదరన్ అనారోగ్యం పేరున సరిగా ప్రచారం చేయకపోవడం, అభ్యర్థుల కోసం పార్టీ ఇచ్చిన నిధులను సక్రమంగా పంచకపోవడంతో మాజీగా మారిపోయారు. తిరువళ్లూరు ఎంపీ వేణుగోపాల్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందినా అక్కడి ఇన్‌చార్జ్ మంత్రి బీవీ రమణకు వేటుతప్పలేదు. ఇది పార్టీలో సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. రమణ తొలగింపునకు సరైన కార ణాలను పార్టీ నేతలే అన్వేషిస్తున్నారు. అమ్మ కేబినెట్‌లో కీలక పోర్టుఫోలియోలను నిర్వర్తిస్తున్న కేపీ మునుస్వామి నుంచి తప్పించి సాధారణమైన కార్మిక సంక్షేమ శాఖను అప్పగించారు. ఎన్నికల సమయంలో అనేక చోట్ల ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొన్నా తగిన నివారణ చర్యలను తీసుకోలేదన్న ఆరోపణ వుంది. పార్టీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షునిగా ఉన్న మంత్రి కేపీ మునుస్వామిని తప్పించి ఎడప్పాడీ పళనిసామిని నియమించారు. కన్యాకుమారి, ధర్మపురిల్లో పార్టీ బాధ్యతలను నిర్వహిస్తున్నవారిపై కూడా జయ వేటువేశారు.
 
 మాజీలకు మళ్లీ చోటు
 సక్రమంగా పనిచేయనివారిపైనే కాదు సమర్థవంతంగా వ్యవహరించిన నేతలపైనా తన నిఘా ఉందని అమ్మ నిరూపించుకున్నారు. గతంలో మంత్రి పదవుల నుంచి తొలగింపునకు గురైన వేలుమణి, అగ్రి కృష్ణమూర్తి, గోకుల ఇందిర ఈ ముగ్గురు తాజా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు విశేషంగా కృషి చేసినందుకు మెచ్చుకోలుగా అమ్మ మళ్లీ పదవులను కట్టబెట్టారు. మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ కె.రోశయ్య సీఎం జయ సమక్షంలో వారి చేత ప్రమాణస్వీకారం చేయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement