ఎస్‌ఎం కృష్ణ మనవడు అంటూ హల్‌చల్
- రోడ్డుపై వాయువేగంతో వాహనాలు నడిపిన యువకులు
- వెంటాడిన పోలీసులు
- మూడు కార్లు స్వాధీనం
- పోలీసుల అదుపులో ఐదుగురు
- నా మనవడు కాదు : ఎస్‌ఎం కృష్ణ
బెంగళూరు : కార్ల సెలైన్సర్ సౌండ్ పెంచి రోడ్లపై వాయు వేగంతో ప్రయాణిస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసిన ఐదుగురు యువకులను ఇక్కడి హైగ్రౌండ్స్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వీరిలో ఓ యువకుడు తాను మాజీ కేంద్ర మంత్రి ఎస్‌ఎం కృష్ణ మనవడూ అంటూ హల్‌చల్ చేశాడు.
వివరాలు... ఆదివారం సాయంత్రం 5.30 గంటలు ఇక్కడి రేస్‌కోర్సు రోడ్డులో జాగ్వర్ కారు (కేఏ08-జెడ్ 99) సహా మూడు కార్లు వాయు వేగంతో ప్రయాణించాయి. వాటికి ఉన్న సెలైన్సర్ల సౌండ్ పెంచి భారీ శబ్ధం చేస్తూ వస్తున్న కార్లను చూసి వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో గుర్రపు రేసులకు వచ్చిన వారు రోడ్డుపైకి వచ్చారు.
స్పందించిన ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపాలని సూచనలు చేశారు. అయితే అవి వాయువేగంతో వస్తుండటంతో వారు కూడా వెనకడుగు వేశారు. దీంతో పోలీసులు ఆ కార్లను వెంబడించారు. మూడు కార్లు రేస్‌కోర్సు రోడ్డులోని తాజ్ హోటల్‌లోకి ప్రవేశించాయి. పోలీసులు అక్కడికి చేరుకుని కౌసిక్, ఆదిత్యా రెడ్డి, విజయ్‌కుమార్‌తో సహ ఐదుగురిని గుర్తించారు. ఆ సమయంలో కౌసిక్ అనే అనే యువకుడు తాను కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ తనయుడని పోలీసులను బెదిరించాడు. వారితో గంటపాటు వాగ్వాదానికి దిగాడు. చివరికి పోలీసులు ఐదుగురు యువకులను హైగ్రౌండ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తీసుకు వ చ్చారు.
అక్కడా వారు ఎవరెవరికికో ఫోన్లు చేసి పోలీసులకు ఇవ్వడానికి ప్రయత్నించారు. పోలీసు అధికారులు పూర్తి వివరాలు రాబట్టడానికి యత్నిస్తున్నారు.
కౌసిక్ ఎవరో తెలియదు : ఎస్.ఎం. కృష్ణ
కౌసిక్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, తన మనవడు లండన్‌లో ఉన్నాడని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎమ్. కృష్ణ స్పష్టం చేశారు. తన పేరును దుర్వినియోగం చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
అపరాధ రుసుం వసూలు
ఈ కేసులో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం కలిగించిన ఒక్కొ వాహనానికి రూ. 900, పోలీసులతో దురుసు ప్రవర్తనకు ఒక్కొక్కరి నుంచి రూ. 2900 చొప్పును పోలీసులు అపరాధ రుసుం వసూలు చేశారు.