
‘ఉట్టి’ కొట్టేదెలా..?
సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాలపై బాంబే హైకోర్టు ఆంక్షలు విధించడంతో ఉట్టి ఉత్సవాలు నిర్వహణ ప్రశ్నార్థకమైంది. వాహనాల రాకపోకలకు, బాటసారులకు ఇబ్బందులు కలగకుం డా మండపాలు ఏర్పాటు చేసే గణేశ్ ఉత్సవ మండళ్లకే అనుమతివ్వాలని బృహన్‌ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ)ని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు ఉట్టి ఉత్సవాలకు కూడా వర్తిస్తాయి. అయితే ఉట్టి ఉత్సవాలు ఎక్కువ శాతం రోడ్లపైనే జరుగుతుండటంతో వాటి నిర్వహణపై మండళ్లు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఏటా ముంబైతోపాటు తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో సుమారు 10 వేల చోట్లకుపైగా ఉట్టి ఉత్సవాలు ఏర్పాటు చేస్తా రు. దాదర్, వర్లీ, లాల్‌బాగ్, పరేల్‌లో అత్యధిక శాతం రహదారులపైనే జరుగుతాయి. రైల్వే స్టేషన్ల బయట, మార్కె ట్ పరిసరాల్లోనూ ఉట్టి ఉత్సవాలు భారీగా జరుగుతాయి. ఇందులో 90 శాతం రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే వే ఉంటాయి. కోర్టు విధించిన ఆం క్షల వల్ల నేతలు ‘వెయిట్ అండ్ సీ’ అనే ధో రణిలో ఉన్నట్లు తెలిసింది. కోర్టు ఆంక్షలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉట్టి ఉత్సవాలు ఆధారపడి ఉంటాయని నిర్వాహకులు భావిస్తున్నా రు.
18 ఏళ్లలోపు పిల్లలకు నిషేధం
ఉట్టి ఉత్సవాల్లో అందజేసే బహుమతులు, పారితోషకాల కోసం ప్రజలు ఎంతకైనా తెగిస్తున్నారు. తొమ్మిది, పది అంతస్తుల ఎత్తు మానవ పిరమిడ్లు నిర్మించేందుకు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఫలితంగా ప్రతిసారి ఉత్సవాల్లో కొందరు చనిపోవడం, వికలాంగులుగా మారడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. దీనిపై సీరియస్ స్పందించిన బాంబే హైకోర్టు ఉట్టి ఉత్సవాల్లో 18 ఏళ్లలోపు పిల్లలు పాల్గొనడంపై నిషేధం విధించింది.
అలాగే వాహన రాకపోకలకు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఉత్సవాలకు అనుమతినివ్వకూడదని తాజాగా ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని ఇటీవల గణేశ్, ఉట్టి ఉత్సవ సార్వజనిక మండళ్ల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేశారు. రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయంతోనే ఉత్సవాలు ఆధారపడి ఉం టాయని నిర్వాహకులు అంటున్నారు.