పళనికి బ్రహ్మరథం
► సొంత జిల్లాలో ఘన స్వాగతం
► నాలుగు జిల్లాలకు రూ. 331 కోట్లు
► అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సాక్షి, సేలం: సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం ప్రప్రథమంగా మంగళవారం సొంత జిల్లా సేలంలో అడుగు పెట్టిన పళనిస్వామికి పశ్చిమ తమిళనాడులోని జిల్లాల్లోని అన్నాడీఎంకే వర్గాలు, మద్దతుదారులు, అధికార యంత్రాంగం బ్రహ్మరథం పట్టాయి. పశ్చిమ తమిళనాడులోని నాలుగు జిల్లాల అభివృద్ధికి రూ. 331 కోట్లను సీఎం కేటాయించారు. పలు పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని కోయంబత్తూరు, ఈరోడ్, నామక్కల్, సేలం తిరుప్పూర్, ధర్మపురి, కృష్ణగిరిలు పశ్చిమ తమిళనాడులోని జిల్లాలుగా పిలుస్తున్నారు. పశ్చిమంలోని సేలం జిల్లా ఎడపాడికి చెందిన పళనిస్వామి ప్రస్తుతం సీఎం కావడం అక్కడి ప్రజలకు ఆనందమే.
సీఎం పగ్గాలు చేపట్టినానంతరం పశ్చిమం మీద పళనిస్వామి దృష్టి పెట్టినట్టున్నారు. ప్రప్రథమంగా మంగళవారం సొంత జిల్లా వేదికగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీఎం పగ్గాలు చేపట్టినానంతరం సొంత జిల్లాకు వచ్చిన పళనిస్వామికి నామక్కల్, సేలంలో బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానాలు సాగాయి. పార్టీ కేడర్, మద్దతుదారులు, ప్రజలు, అధికార వర్గాలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రూ. 331 కోట్లతో: సేలం కలెక్టరేట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రూ.331 కోట్లతో చేపట్టనున్న పలు పనులకు శంకుస్థాపన చేశారు.
ఇందులో సేలం జిల్లాలో రూ.115 కోట్లు, నామక్కల్ జిల్లాలో రూ.61 కోట్లు, ధర్మపురి జిల్లాలో 60 కోట్లు, కృష్ణగిరి జిల్లాలో రూ. 93 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ఉన్నాయి. అలాగే, లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేశారు. నిర్మాణాలను పూర్తి చేసుకున్న పలు భవనాలను ప్రారంభించారు. పశ్చిమ జిల్లాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించడం లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రకటించారు. గతంలో అమ్మ జయలలిత అసెంబ్లీలో 110 నిబంధనల మేరకు చేసిన ప్రకటనల హామీలనంటినీ నెరవేరుస్తాననన్నారు.