= బట్టలు ఆరవేసే తాడు అడ్డంగా కట్టారంటూ గొడవ...
= బెంగళూరు జనతా కాలనీలో దుర్ఘటన
= గురువారం సాయంత్రం వివాదం తీవ్ర రూపం
= రాత్రి వరకూ ఇరు కుటుంబ సభ్యుల కొట్లాట
= కర్రలతో దాడి.. మహిళపై కిరోసిన్ పోసి నిప్పు
బెంగళూరు, న్యూస్‌లైన్ : ఇంటి ముందు బట్టలు ఆర వేసే విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ ఓ మహిళ సజీవ దహనానికి కారణమైంది. ఇక్కడి సోలదేవనహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలోని దొడ్డ బెలెకెరె జనతా కాలనీలో కారు డ్రైవర్ నరసింహమూర్తి, రవి కళ (26) దంపతులు ఇద్దరు పిల్లలతో కలసి నివాసం ఉంటున్నారు. ఇదే వీధిలో రవి కళ అన్న రవికుమార్ నివాసం ఉంటున్నాడు.
నరసింహమూర్తి నాలుగు నెలల కిందటే ఈ ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకున్నాడు. రవి కళ ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ పని చేస్తున్నది. ఆమె ఇంటి వెనుక మునితాయమ్మ, ఆమె పిల్లలు మంజు, మురళి, రూప నివాసముంటున్నారు. రవి కళ ఇంటి ముందు బట్టలు ఆరవేసుకోవడానికి తాడు కట్టింది. దీని వల్ల వచ్చి పోవడానికి తమకు ఇబ్బంది కలుగుతోందని మునితాయమ్మ పలు సార్లు గొడవ పడింది. రవి కళ మరో తాడు కూడా కట్టి బట్టలు ఆరవేయడంతో గురువారం సాయంత్రం మునితాయమ్మ గొడవకు దిగింది. రాత్రి 8.30 గంటల వరకు గొడవ జరుగుతూనే ఉంది.
రవి కుమార్ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి సర్ది చెబుతుండగానే.. మంజు, మురళి పెద్ద కర్రతో అతని తల మీద చితకబాదారు. తరువాత ఇంటిలోకి వెళ్లి కిరోసిన్ డబ్బా తీసుకు వచ్చారు. రవి కళ పారిపోకుండా ఇద్దరు పట్టుకున్నారు. ఒకరు ఆమె మీద కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఒక్క సారిగా అగ్ని కీలలు శరీరమంతా వ్యాపించడంతో రవి కుమార్‌తో పాటు చుట్టు పక్కల వారు ఆమెను రక్షించే సాహసం చేయలేక పోయారు. అక్కడే ఆమె సజీవ దహనమైంది. ఈ సంఘటన జరిగిన వెంటనే మునితాయమ్మ, మంజు, మురళి, రూప పారిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సప్తగిరి ఆస్పత్రికి తరలించారు. రవి కుమార్ చికిత్స పొందుతున్నాడని పోలీసులు శుక్రవారం తెలిపారు.