న్యూఢిల్లీ: అనూజ్ బన్సాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి. దాతలు అందించే చెక్కులు, విరాళాలకు సంబంధించి ఫోన్ కాల్స్ మాట్లాడుతుండేవాడు. కానీ, మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ఆప్ అభిమానులు చేస్తున్న ఫోన్ కాల్స్‌తో బిజీబిజీగా గడుపుతున్నాడు. కాల్ చేసిన ప్రతి ఒక్కరూ ‘మా రాష్ట్రంలో ఆప్ శాఖ ఎప్పుడు ప్రారంభిస్తున్నారు?’ అని అడుగుతుండటంతో జవాబు చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ‘ప్రతి ఒక్కరూ తమ రాష్ట్రం, నగరంలో ఆప్ శాఖను చూడాలనుకుంటున్నారు. అందకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికీ నేను కచ్చితమైన సమాధానమిస్తున్నాను. మమ్మల్ని మీరు ఆహ్వానిస్తే వస్తామని చెబుతున్నాను’ అని బన్సాల్ చెప్పారు.
కాగా, యువ రాజకీయ పార్టీ అయిన ఆప్‌ను ఏర్పాటు చేసి ఇప్పటికి 27 నెలలే గడిచింది. ఇప్పటికిప్పుడు ఢిల్లీకి బయట దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించే ప్రణాళికలు ఆప్‌కు లేవు. లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానల్లో పోటీచేసి ఘోరంగా విఫలమైన విషయాన్ని ఆప్ నాయకులు ఇంకా మర్చిపోలేదు. కానీ, దేశ రాజకీయాల్లో కేంద్ర బిందువు అవడానికి ఇది పెద్ద విషయం కాదు. కాంగ్రెస్‌ను స్థానాన్ని ఆక్రమించడం ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఆ విస్తరణ పంజాబ్‌తోనే ప్రారంభించవచ్చు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం కోసం కొన్ని నెలలుగా తీవ్రంగా శ్రమించిన పార్టీ వాలంటీర్లు ఇప్పటికే తమ పట్టణాలు, నగరాల్లో పార్టీ శాఖలు ఏర్పాటు చేశారు. ‘మా సిద్ధాంతాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్లినట్లయితే, మార్పునకు మార్గదర్శకులుగా నిలుస్తాం. ఢిల్లీలో ఇంటింటికీ ప్రచారంలో పాల్గొన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గురించి ప్రజలు అడిగే ప్రశ్నలు కొన్ని చాలా బాధ పెట్టాయి.
ముఖ్యంగా కేజ్రీవాల్ రాజీనామాపై అనేక మంది ప్రశ్నించారు. కొంతమంది తీవ్రంగా అవహేళన కూడా చేశారు. కానీ, కొంత కాలానికి అందరి నోళ్లు మూతపడ్డాయి. తిరిగి ప్రజలు మళ్లీ కేజ్రీవాల్‌ను గౌరవించడం మొదలు పెట్టారు. ఇతర పార్టీల వారు డబ్బు చెల్లించి కొంతమందిని ప్రచారంలో వెంటతిప్పుకున్నారు. కానీ, ఆప్ కోసం కొన్ని వేల మంది స్వచ్ఛందంగా ముందుకు రావడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. మహారాష్ట్ర, కర్ణాటక, హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇలా అనేక రాష్రాల నుంచి తరలివచ్చి రోజులు, వారాల తరబడి ప్రచారంలో పాల్గొన్నారు. వారి రవాణా ఖర్చులను కూడా పూర్తిగా వారే భరించారు. ఆప్ కేవలం వారికి వసతి, ఆహార సౌకర్యాలు మాత్రమే కల్పించింది’ అని బెంగుళూరుకు చెందిన ఆదర్శ్‌కుమార్ (23) అన్నాడు. ఆప్ విజయం కోసం ఇతను గత కొన్ని నెలలుగా ఇక్కడే ఉండి ఎన్నికల ప్రచార బృందానికి ఇన్‌చార్జిగా వ్యవహరించాడు. మొత్తం 20,000 మంది వాలంటీర్లు 70 నియోజకవర్గాల్లో రేయింబవళ్లు పార్టీ కోసం కష్టపడ్డారు. ఒకవేళ ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించాలని అధినాయకత్వం నిర్ణయిస్తే అనుసరించడానికి వీరంతా సైనికుల వలే సిద్ధంగా ఉన్నారు.
మహారాష్ట్ర నుంచి వచ్చిన మనీష్(23) ఇప్పటికీ ఢిల్లీలోనే ఉన్నాడు. అతను ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ ప్రమాణస్వీకారాన్ని వీక్షించాలనుకుంటున్నాడు. కొంతమంది పెయిడ్ హాలీడే పెట్టి వచ్చి ప్రచారంలో పాల్గొన్న యువకులు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ‘చాలా మంది వాలంటీర్లు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. కొంత మంది మాత్రమే ఉన్నత తరగతికి చెందిన వాళ్లు ఉన్నారు. కానీ, మా అందరి మధ్య బాంధవ్యం బలపడింది. మేమందరం ‘ఆప్’ని చూసి గర్వపడుతున్నాం’ అని మనీష్ తెలిపాడు.
ఆప్‌కు పెరిగిన క్రేజ్
Published Sun, Feb 15 2015 10:25 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement