నా ట్రాక్ రికార్డే గెలిపిస్తుంది...
సాక్షి, బెంగళూరు : రాజకీయాలతో పాటు ఎన్నికల నిర్వహణలోనూ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని బెంగళూరు దక్షిణ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి, ఐటీ నిపుణుడు నందన్ నీలేకని అన్నారు. శుక్రవారమిక్కడి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. బెంగళూరును అభివృద్ధి చేయడంతో పాటు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
బెంగళూరు సౌత్ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇన్నేళ్ల తన వృత్తి జీవితంలో అప్పగించిన ఏ పనైనా ఐటీ నిపుణుడుగా సమర్థవంతంగా పూర్తి చేస్తానని ప్రజలు నమ్ముతున్నారని, ఆ ట్రాక్ రికార్డే తనను గెలిపిస్తుందని అన్నారు. ఆప్ పార్టీ ద్వారా తనకెలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేశారు.
ఒక బెంగళూరు వాసిగా తనకు నగరంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఇక ప్రజలను నేరుగా కలవడంతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నానని, ఇదే సందర్భంలో తన క్యాంపైన్‌లో భాగంగానే సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తన పాత సహోద్యోగి, ప్రస్తుత ఆప్ ఎంపీ అభ్యర్ధి బాలకృష్ణన్‌కు శుభాకాంక్షలు మాత్రమే తాను చెప్పగలనని అన్నారు.