వ్యవసాయ శాఖ ఇంజినీర్ ముత్తు కుమారస్వామి ఆత్మహత్య కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్
ఆమ్ ఆద్మీ నేతల అరెస్ట్
వ్యవసాయ శాఖ ఇంజినీర్ ముత్తు కుమారస్వామి ఆత్మహత్య కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సీఎం పన్నీరు సెల్వం ఇంటిని ఆమ్ ఆద్మీ నాయకులు, కార్యకర్తలు ముట్టడికి ప్రయత్నించారు. ఆయన ఇంటి పిట్ట గోడను దూకేందుకు కొందరు యత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ నాయకులు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు.
సాక్షి, చెన్నై: తిరునల్వేలి జిల్లా వ్యవసాయ శాఖ ఇంజినీర్ ముత్తుకుమారస్వామి రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణం వెనుక మిస్టరీ ఉందని, ఆ శాఖ మంత్రి అగ్రి కృష్ణమూర్తి వేధింపులు, ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆరోపణలు బయలు దేరాయి. దీంతో అగ్రి మంత్రి పదవి ఊడింది. అయితే, ఆయనపై ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసును సీబీసీఐడీ వర్గాలు మందకొడిగా ముందుకు తీసుకెళ్తున్నారన్న ఆరోపణలు బయలు దేరాయి. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం హఠాత్తుగా ఆమ్ ఆద్మీ నాయకులు, కార్యకర్తలు సీఎం ఇంటి వైపుగా చొచ్చుకు వెళ్లి కలకలం సృష్టించారు.
ముట్టడి: శనివారం మధ్యాహ్నం గ్రీన్‌వేస్ రోడ్డులో ఆమ్ ఆద్మీ కార్యకర్తలు, నాయకులు గుమికూడారు. హఠాత్తుగా వారందరూ ఆ రోడ్డులోని సీఎం పన్నీరు సెల్వం ఇంటి వైపుగా చొచ్చుకు వెళ్లారు. ఈ హఠాత్పరిణామంతో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు విఫలం యత్నం చేశారు. దీంతో సీఎం ఇంటికి సమీపంలో బైఠాయించిన నిరసన కారులు కేసును సీబీఐకు అప్పగించాల్సిందేనని డిమాండ్ చేశారు. కొందరు సీఎం ఇంటి పిట్ట గోడ వైపుగా చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. అయితే, భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, నిరసన కారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. చివరకు అదనపు బలగాల్ని రప్పించి నిరసన కారుల్ని బలవంతంగా అరెస్టు చేశారు. ఈ నిరసనలో గ్రీన్ వేస్ రోడ్డులో కాసేపు ఉత్కంఠ నెలకొంది.