
లైంగిక వేధింపుల కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్
ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహనియాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహనియాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం దినేశ్ తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
తనపై తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఎంఎం ఖాన్ హత్యకేసును పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దినేశ్ ఆరోపించారు. ‘ఢిల్లీ పోలీసుల గూండాగిరిని మీరు స్వయంగా చూస్తున్నారు.. వాళ్లు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు’ అని విలేకరులనుద్దేశించి అన్నారు.
నీళ్ల కోసం వెళ్తే తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ దినేశ్పై ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నీళ్ల గురించి మరోసారి అడగగానే తనతో పాటు ఇతర మహిళలను నోటికొచ్చినట్లు తిట్టి, తోసేశారని ఆమె చెప్పారు. దినేష్ మోహనియాపై కేసు పెట్టి.. అతడిని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.