బెంగళూరు: విధానసభలో మంత్రులు, ఎమ్మెల్యేల గైర్హాజరుపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప తీవ్రంగా స్పందించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం విధానసభ కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంలో ఐటీ శాఖమంత్రి ఎస్.ఆర్ పాటిల్ ఒక్కరే చట్టసభలో కన్పించారు. ఇక అధికార పార్టీకు చెందిన ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో సభలో ప్రభుత్వ ప్రతినిధులు తక్కువగా ఉన్న విషయాన్ని స్పీకర్ కాగోడు తిమ్మప్ప విపక్షసభ్యులు దృష్టికి తీసుకువచ్చారు. ‘వారికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అసలు శాసనసభ అంటే ఏంటో మంత్రులతో పాటు అధికార పార్టీకు చెందిన శాసనసభ్యులకు అర్థమయినట్లు లేదు.’ అని అసహనం వ్యక్తం చేశారు.
ఆ సమయంలో బీజేపీ సీనియర్ నేత విశ్వేశ్వర హెగ్డే కాగేరి కలుగ జేసుకుని ‘మంత్రి అంబరీష్ ఒక్కరే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారన్న వార్తలు వస్తున్నాయి. అయితే సభలో పరిస్థితి చూస్తుంటే మంత్రులందరూ అధికార కాంగ్రెస్‌కు టా...టా చెప్పినట్లు ఉంది.’ అని వ్యంగ్యాస్త్రం వదిలారు. అంతేకాక అంబరీష్ మంత్రి పదవికి రాజీనామా చేసుంటే ఆ పత్రాన్ని మీకేమైనా అందించారా అని స్పీకర్ కాగోడు తిమ్మప్పను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ సమయంలో ఎస్.ఆర్ పాటిల్ ఏదో చెప్పడానికి ప్రయత్నించగా విశ్వేశ్వర హెగ్డే కాగేరి వినిపించుకోకుండా....‘బాబురావ్ చించన్ సూర్ పై చెక్ బౌన్స్ కేసు., చిన్న నీటిపారుదల శాఖ మంత్రి శివరాజ్ తంగడి పై హత్యారోపణలు, రైతుల ఆత్మహత్యలపై నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్న ఉద్యాన శాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్ప ఇలా ప్రతి ఒక్కరిపై ఏదో ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మంత్రులే శాసనసభకు గైర్హాజరైతే ఏ విషయాలపై చర్చించాలి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో శాసనసభలో జేడీఎస్ పార్టీ ఉపనాయకుడు వై.వి.ఎస్ దత్తా కలుగజేసుకుని ‘అభివృద్ధిలో వెనకబడిన ఉత్తర కర్ణాటక విషయమై చర్చించేందుకే స్పీకర్ రెండు రోజుల సమయాన్ని కేటాయించారు.
అయితే ఈ విషయమై అధికార పార్టీకు ఎటువంటి ఆసక్తి లేదు. ఇక ప్రభుత్వ ప్రతినిధుల్లో 85 శాతం మంది ఇలా నిర్లక్ష్యవైఖరితో ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం అయిన శాసనసభకు గైర్హాజరు కావడం సరికాదు. కనీసం ఉత్తర కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు లేకపోతే ఎలా.’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమయంలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప కలుగజేసుకుని అధికార పార్టీ నాయకులతో తాను మాట్లాడి హాజరు శాతం పెంచడానికి ప్రయత్నిస్తానని చెప్పి పరిస్థితిని యథాస్థితికి తేవడంతో శాసనసభలో సభా కార్యక్రమాలు యథావిధిగా జరగడం ప్రారంభించాయి.
సభ్యుల గైర్హాజరుపై స్పీకర్ గరం
Published Fri, Jul 10 2015 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement