(ఫైల్) ఫోటో
చెన్నై : తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సమథువా మక్కల్ కచ్చి పార్టీ అధినేత, నటుడు శరత్ కుమార్ బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితతో భేటీ అయ్యారు. పోయిస్ గార్డెన్లో సీఎం నివాసంలో వీరి భేటీ జరిగింది. సమావేశం అనంతరం శరత్ కుమార్ మాట్లాడుతూ అన్నాడీఎంకే కూటమికి తమ మద్దతు కొనసాగిస్తామని తెలిపారు. కాగా ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమికి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శరత్ కుమార్ మళ్లీ అన్నాడీఎంకే కూటమికి చేరువయ్యారు.
మరోవైపు నిన్న మొన్నటివరకూ పొత్తులపై ఉత్కంఠకు తెరలేపిన డీఎండీకే అధినేత విజయకాంత్ డీఎంకే, బీజేపీలకు ఝలక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వమే లక్ష్యంగా పావులు కదిపిన కెప్టెన్ ఇవాళ పీడబ్ల్యూఎఫ్, ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో పొత్తు కుదుర్చుకున్నారు. కెప్టెన్ చర్యకు డీఎంకేతో పాటు బీజేపీకి షాక్ తగిలినట్లు అయింది. పదేళ్ల క్రితం 2005లో పార్టీని స్థాపించిన విజయకాంత్...తొలిసారిగా ఎదుర్కొన్న ఎన్నికల్లో ఆయన మినహా అందరూ ఓడిపోయారు. డీఎండీకే ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగారు. 2011 ఎన్నికల్లో అతిపెద్ద రెండవపార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.