ఏఐసీసీ అధికార ప్రతినిధిగా కుష్బు
కాంగ్రెస్‌లో గ్రూపులు లేవని అందరిదీ ఒకే గ్రూప్ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి కుష్బు అన్నారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి అంటే తనకు ప్రత్యేక గౌరవం, మర్యాద అని వ్యాఖ్యానించారు. పదవి దక్కించుకున్న కుష్బుకు సత్యమూర్తి భవన్‌లో ఘన స్వాగతం లభించింది.
సాక్షి, చెన్నై: కాంగ్రెస్‌లోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఉన్నత పదవిని కుష్బు దక్కించుకున్నారు. ఆ పార్టీలో ప్రత్యేక గ్లామర్‌గా అవతరించిన కుష్బు వాక్ చాతుర్యాన్ని గుర్తించిన అధిష్టానం అందుకు తగ్గ పదవిని అప్పగించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా నియమితులైన కుష్బు బుధవారం సత్యమూర్తి భవన్‌కు వచ్చారు. అధికారిక హోదాతో పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టిన ఆమెకు పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. నాయకులు చిరంజీవి, రామచంద్రన్, జ్యోతి, తదితరులు పుష్ప గుచ్ఛాలను అందించి ఆహ్వానం పలికారు. ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ వర్గాలు పెద్ద సంఖ్యలో సత్యమూర్తి భవన్‌కు రావడం విశేషం. అనంతరం సత్యమూర్తి భవన్‌లో మీడియాతో కుష్బు మాట్లాడారు.
తన మీద నమ్మకంతో అతి పెద్ద బాధ్యతను అప్పగించిన తమ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ పరంగా తనను ఉన్నత పదవిలో చూడాలని ఈవీకేఎస్ కాంక్షించే వారని, అందుకు తగ్గట్టుగానే అతి పెద్ద పదవిని పార్టీ అధిష్టానం అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. తాను పార్టీలోకి వచ్చి ఐదు నెలలవుతోందని, ఈ కాలంలో తనను పార్టీలోని నాయకులు అందరూ తమ ఇంట్టి బిడ్డగా ఆదరించారన్నారు. రాష్ట్ర పార్టీలో గ్రూపులు లేవని, అందరిదీ కాంగ్రెస్ అనే ఒకే ఒక గ్రూప్ మాత్రమేనన్నారు. మీడియా మాత్రమే వేర్వేరుగా నాయకుల్ని చూపిస్తూ, గ్రూపుల్ని అంటగట్టుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుంటే, కామరాజర్ లేరని, కామరాజర్ లేకుంటే కాంగ్రెస్ లేరని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రజల పక్షాన నిలబడి వీధి పోరాటాల లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్రంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి అంటే తనకు ఎంతో గౌరవం అని, ఆయన మీద ప్రత్యేక మర్యాద ఉందని మరో ప్రశ్నకు కుష్బు సమాధానం ఇచ్చారు.