► తప్పించుకున్న వివాహిత
► వడ్డినకొప్ప గ్రామంలో ఘటన
శివమొగ్గ : కుమార్తెతో సమానంగా చూడాల్సిన కోడలిని అత్త, మామ, అడపడచు రాచి రంపాన పెట్టారు. అదనపు కట్నం కోసం కోడలిపై కిరోసిన్ పోసి తగులబెట్టేందుకు యత్నించారు. అయితే బాధితురాలు వారి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన శివమొగ్గ పొలిసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. శిరసి ప్రాంతానికి చెందిన ప్రియకు మూడు సంవత్సరాల క్రితం శివమొగ్గ నగరం సమీపంలోని వడ్డినకొప్ప గ్రామానికి చెందిన మంజునాథ్‌తో వివాహమైంది. ఈ సమయంలో భారీగా కట్నకానుకలు సమర్పించారు. రెండు నెలలు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాల కట్న వేధింపులు మొదలయ్యాయి.
అదనంగా రూ. 25 లక్షలు తీసుకురావాలని మంజునాథ్ తల్లి నీలమ్మ, తండ్రి తిమ్మణ్ణ, వారి కుమార్తె కలిసి ప్రియను రాచి రంపాన పెట్టడంతోపాటు ఓ దశలో చేయి కూడా చేసుకునేవారు. ఈక్రమంలో వారం రోజుల క్రితం మరోమారు వేధింపులకు పాల్పడ్డారు. తాము చెప్పిన మొత్తం తీసుకురాకపోతే చంపివేస్తామని బెదిరించారు. దీనికితోడు తెల్ల కాగితంపై సంతకం చేయించాలని కత్తులతో సైతం బెదిరించారు. అయినప్పటికీ సంతకం పెట్టలేదు.
దీంతో అత్తమామలు ప్రియను బంధించి వంటిపై కిరోసిన్ పోశారు. నిప్పు పెట్టేందుకు యత్నించగా ప్రియ తప్పించుకొని ఇంటి బయటకు వచ్చింది. స్థానికులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శివమొగ్గ ఎస్పీ గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న అత్త, మామ, అడపడచు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
కట్నం కోసం తగులబెట్టేందుకు యత్నం
Published Thu, May 5 2016 2:56 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM
Advertisement
Advertisement