అన్నింటా గందరగోళమే.. | All results have guessed corporations | Sakshi
Sakshi News home page

అన్నింటా గందరగోళమే..

Published Thu, Apr 23 2015 10:35 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

All results have guessed corporations

- ఏ కార్పొరేషన్‌లోనూ రాని మెజారిటీ స్థానాలు
- నవీముంబైలో ఎన్సీపీ.. మిగతా చోట్ల కాషాయ కూటమి ఆధిక్యం
- చతికిల పడ్డ కాంగ్రెస్..హిట్టయిన ఎంఐఎం
- కీలకం కానున్న స్వతంత్రులు
సాక్షి, ముంబై:
కార్పొరేషన్ల ఫలితాలు అందరూ ఊహించినట్లే వచ్చాయి. పోలింగ్ తక్కువగా నమోదవడంతో నవీముంబై, ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో అన్నిచోట్ల గందరగోళం నెలకొంది. అధికారం ఏర్పాటు చేయాలంటే ఇతరుల మద్దతు కచ్చితంగా తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.

వేర్వేరుగా పోటీ చేసిన ప్రధాన పార్టీలు ఇప్పుడూ పంతాలకు పోతే అధికారానికి దూరమవాల్సిందే. నవీముంబై, ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లకు బుధవారం ఎన్నికలు జరగ్గా గురువారం ఫలితాలు వెలువడ్డాయి. గత ఎన్నికలతో పోలిస్తే కొన్ని పార్టీలకు స్థానాలు పెరగ్గా, మరికొన్ని పార్టీల స్థానాలు తగ్గిపోయాయి.

నవీముంబై ఎన్సీపీ అతిపెద్ద పార్టీ
నవీముంబైలో 111 వార్డులుండగా మొత్తం 568 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందరికన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 52 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ ప్రధాన పార్టీలైన శివసేన, బీజేపీ కలసే పోటీ చేశాయి. శివసేన 68 స్థానాల్లో పోటీచేయగా 38 వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ 43 స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఆరు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కాంగ్రెస్ ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేశాయి. ఎన్సీపీ 107 స్థానాల్లో పోటీచేయగా ఏకంగా 52 స్థానాలు దక్కించుకుంది. పంతాలకు పోయిన కాంగ్రెస్ 89 స్థానాల్లో పోటీచేసి 10 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇతరులు ఐదు స్థానాలు గెలుచుకున్నారు. కార్పొరేషన్‌లో అధికారం ఏర్పాటు చేయాలంటే మేజిక్ ఫిగర్ 56 (స్థానాలు) కావాలి. అందులో 52 స్థానాలు ఎన్సీపీకి రావడంతో ఈ పార్టీ అధికారం దక్కించుకోవడ ం ఖాయంగా కనిపిస్తోంది. తమకు ఐదుగురు స్వతంత్రుల మద్దతు ఉందని, కాంగ్రెస్‌తో జతకట్టాల్సిన అవసరం లేదని ఎన్సీపీ నేత గణేశ్ నాయిక్ అన్నారు. లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో ప్రభావం కోల్పోయిన ఎన్సీపీకి ఈ గెలుపు ఊరటనిచ్చే అంశం.

కాషాయ కూటమి విజయ భేరి
ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 113 వార్డులకు జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మొత్తం 900 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. శివసేన, బీజేపీ కూటమికి ఇక్కడి ఫలితాలు నవీముంబై కంటే కొంత మెరుగ్గానే వచ్చాయి. శివసేన 64 స్థానాల్లో పోటీచేయగా 29 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 49 స్థానాల్లో పోటీ చేసి 23 గెలుచుకుంది.

కాషాయకూటమికి మొత్తం 52 స్థానాలు వచ్చాయి. ఔరంగాబాద్‌లో ముస్లిం సంఖ్య ఎక్కువే అయినప్పటికీ నవీముంబైతో పోలిస్తే ఇక్కడ బీజేపీకి ఫలితాలు చాలా మెరుగ్గా వచ్చాయి. 110 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. ఇక్కడ కూడా కేవలం 10 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో కాంగ్రెస్ ఇరు చోట్ల పూర్తిగా దెబ్బతింది. నవీముంబైలో అధికార పీఠం ఖాయం చేసుకున్న ఎన్సీపీ.. 70 స్థానాల్లో పోటీచేసి కేవలం మూడు స్థానాలు మాత్రమే గెలుచుకుంది.

ఎంఐఎం హిట్..
ఎంఐఎం 53 వార్డుల్లో పోటీ చేసి ఏకంగా 25 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు ఫలితాలు చాలా మెరుగ్గా వచ్చాయి. నవీముంబైతో పోలిస్తే ఔరంగాబాద్‌లో పోలింగ్ శాతం ఎక్కువ నమోదైంది. కాని ఇక్కడ రికార్డు స్థాయిలో అభ్యర్థులు బరిలో దిగడంవల్ల ఓట్లు చీలిపోయి ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు.

అధికారం ఏర్పాటు చేయాలంటే మేజిక్ ఫిగర్ 57 స్థానాలు కావాలి. కాశాయ కూటమికే అధికార పీఠం దక్కించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీఎస్పీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు, ఇతరులు 18 మంది ఉన్నారు. వీరిలో ఎవరి మద్దతుతోనైనా అధికారం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశముంది.

అంబర్‌నాథ్, బద్లాపూర్‌లో కాషాయ రెపరెప
అంబర్‌నాథ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారం ఏర్పాటు చేయడానికి  కాశాయ కూటమికే ఎక్కువ అవకాశం ఉంది. మొత్తం 57 స్థానాలుండగా ఇందులో మూడు స్థానాలు ఇది వరకే ఏకగ్రీవమయ్యాయి. మిగతా 54 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో శివసేనకు 26, మిత్రపక్షమైన బీజేపీకి 10 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ ఎనిమిది, ఎన్సీపీ ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నాయి.

బద్లాపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా కాషాయకూటమి అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో ఇద్దరు, ముగ్గురు స్వతంత్రుల అండతో అధికారం ఏర్పాటు చేసేందుకు అవకాశం లభించింది. కాంగ్రెస్, ఎన్సీపీలు ఇక్కడ కూడా చతకిలపడిపోయాయి.  మొత్తం 47 స్థానాలుండగా ఐదు వార్డులు ఇదివరకే ఏకగ్రీవమయ్యాయి. మిగతా 42 స్థానాల్లో కాశాయ కూటమి ఎక్కువ స్థానాలు గెలుచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement