మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాలు, ఒక నగరపాలక సంస్థలో ఆదివారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్‌తో పాటు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, జేసీ జె.మురళీ, ఏజేసీ బీఎల్ చెన్నకేశవరావు, ఎస్పీ జె.ప్రభాకరరావు, ఏఎస్పీ బీడీవీ సాగర్ ఎన్నికలను పర్యవేక్షించారు. నందిగామ 19వ వార్డులో రెండు పోలింగ్ కేంద్రాలు ఉండగా అనాసాగరం, హనుమంతపాలెం ప్రాంతాలకు చెందిన ఓటర్ల జాబితాలు తారుమారయ్యాయి. దీంతో ఇక్కడ పోలింగ్‌ను నిలిపివేశారు. అనాసాగరం పోలింగ్ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పోలింగ్ ప్రారంభమైన అనంతరం 200 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.
హనుమంతుపాలెం ప్రాంతానికి చెందిన ఓటర్లు పోలింగ్ కేంద్రానికి రాకపోవటంతో ఇక్కడ ఎన్నిక నిలిచిపోయింది. దీంతో 19వ వార్డులో పోలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు నందిగామ పురపాలక సంఘం ఎన్నికల అధికారి పి.పల్లారావు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల తరువాత వచ్చినవారిని అనుమతించలేదు. పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేశారు. అనంతరం కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు.
చెదురుమదురు ఘటనలు...
నందిగామ 17వ వార్డులో పోలింగ్ ఏజెంట్లకు ఫారాలు ఇవ్వకపోవటంతో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు పురపాలక సంఘ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నూజివీడులో 24వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి చందర్‌ను పోలీసులు మెడపట్టుకుని గెంటేయటంతో వివాదం నెలకొంది. మచిలీపట్నం పురపాలక సంఘంలోని 5వ వార్డులో టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది.
వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఎస్పీ జె.ప్రభాకరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి పరిస్థితిని చక్కదిద్దారు. మచిలీపట్నంలోని టౌన్‌హాలులో అనారోగ్యంగా ఉన్నవారిని సైతం వాహనంలో పోలింగ్ వద్దకు తీసుకువెళ్లనివ్వటం లేదంటూ వైఎస్సార్ సీపీ అభ్యర్థి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 42వ వార్డులో టీడీపీ అభ్యర్థి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ఓటర్లకు చికెన్ పంపిణీ చేయటం వివాదాస్పదమైంది.
42వ వార్డులో ఓ మహిళ ఓటువేసే సమయంలో ప్రిసైడింగ్ అధికారి ఒకటో నంబరును నొక్కాలని సలహా ఇచ్చారు. అక్కడ ఒకటో నంబరులో టీడీపీ గుర్తు ఉండటంతో ఆ మహిళ ప్రిసైడింగ్ అధికారిని నిలదీసింది. దీంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ధనికొండ నాగమల్లేశ్వరి ఈ విషయాన్ని ఏజేసీ, మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏజేసీ పోలింగ్ కేంద్రానికి వచ్చి ప్రిసైడింగ్ అధికారిని మందలించారు. మచిలీపట్నంలోని ఐదో వార్డులో ఈవీఎం మొరాయించటంతో కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.
గుడివాడ 35వ వార్డులో ఈవీఎం మొరాయించటంతో 40 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది. మచిలీపట్నంలోని 35వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థిని పల్లపోతు లలితకుమారిని 14వ వార్డు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోటమర్రి వెంకట బాబాప్రసాద్ తోసివేశారు. దీంతో వైఎస్సార్ సీపీ బాబాప్రసాద్‌పై ఆర్.పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఓటు వేసిన కలెక్టర్, జేసీ...
కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మచిలీపట్నంలోని 9వ వార్డులోని కేకేఆర్ గౌతమ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో, జేసీ జె.మురళి 11వ వార్డులోని లేడీస్ క్లబ్‌లోనిపోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1వ తేదీన ఓట్ల లెక్కింపు విషయంపై ఎన్నికల సంఘం ఇచ్చే మార్గదర్శకాలను బట్టి చర్యలుంటాయని కలెక్టర్ తెలిపారు.
స్ట్రాంగ్ రూమ్‌లో ఓటరు తీర్పు ...
మున్సిపల్ ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పోలింగ్ కేంద్రాల నుంచి తీసుకువచ్చిన ఈవీఎంలను ఆయా పురపాలక సంఘాల రిటర్నింగ్ అధికారులు, కమిషనర్లకు ప్రిసైడింగ్ అధికారులు అప్పగించారు. ఆయా పురపాలక సంఘాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్‌రూమ్‌లకు సీలు వేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుందా లేదా అన్న అంశంపై ఎన్నికల సంఘం స్పష్టత ఇస్తుందని అధికారులు చెబుతున్నారు.
‘పుర’ పోరు ప్రశాంతం
Published Mon, Mar 31 2014 3:19 AM | Last Updated on Thu, Mar 21 2019 8:31 PM
Advertisement
Advertisement