- గుజరాత్ అభివృద్ధిపై మోడీకి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ సవాల్
- పలు రంగాల్లో ఆ రాష్ర్టం వెనుకబడింది
- మోడీ అబద్ధాలకోరు
- అందరినీ ప్రశ్నించడమే ఆయనకు తెలుసు
- ఏనాడూ ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించలేదు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గుజరాత్‌ను ఆదర్శ రాష్ట్రంగా చెప్పుకునే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, విద్య సహా పలు రంగాల్లో ఆ రాష్ర్ట వెనుకబాటు తనాన్ని వెల్లడించడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ ఆరోపించారు. దీనిపై చర్చకు వస్తే తాము నిరూపిస్తామని సవాల్ విసిరారు. కేపీసీసీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ ఎన్నికల ప్రచార డీవీడీని విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
మోడీ అబద్ధాలకోరని, అసత్యాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. గుజరాత్ విద్యా రంగంలో దేశంలో 17వ స్థానంలో ఉందని, పౌష్టికాహార లోపంతో లక్షల మంది పిల్లలు బాధ పడుతున్నారని వివరించారు. పాఠశాలలకు పోకుండా నిలిచిపోతున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. విద్యుత్ ఉత్పాదనలో గుజరాత్ 10వ స్థానంలో ఉందన్నారు.
ఆ రాష్ట్ర ప్రజలపై రూ.లక్షా 76 వేల కోట్ల రుణ భారం ఉందని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే... గుజరాత్‌ను ఆదర్శ రాష్ట్రమని మోడీ ఎలా అనగలుగుతున్నారని నిలదీశారు. ఆయనో అపాయకారి అని, అందరినీ ఆయన ప్రశ్నిస్తుంటారని, ఆయననెవరూ ప్రశ్నించకూడదని అన్నారు. బహిరంగ సభలు పెట్టి ఉపన్యాసాలు దంచడం మినహా, ఏనాడైనా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, వారడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారా అని నిలదీశారు. గుజరాత్ శాసన సభలో గవర్నర్ ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై కూడా చర్చ జరగలేదని తెలిపారు.